Begin typing your search above and press return to search.

'పెద్ది' విడుదలపై వీడని సందిగ్ధత.. నిర్మాత‌ల మైండ్ గేమ్!

రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న `పెద్ది` చిత్రం విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By:  Sivaji Kontham   |   5 April 2026 10:55 AM IST
పెద్ది విడుదలపై వీడని సందిగ్ధత.. నిర్మాత‌ల మైండ్ గేమ్!
X

రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న `పెద్ది` చిత్రం విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏప్రిల్ 30న సినిమా వస్తుందని స్వయంగా చరణ్ ప్రకటించినా.. ఇటీవ‌ల హ‌నుమాన్ జ‌యంతి పోస్ట‌ర్ లో రిలీజ్ తేదీ లేక‌పోవ‌డంతో ట్రేడ్ వర్గాల్లో అనేక సందేహాలకు తావిచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ పంపిణీదారులు మరో వారంలోగా స్పష్టత వస్తేనే ఆన్‌లైన్ బుకింగ్స్ సజావుగా సాగుతాయని అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు అత్యవసరంగా మారింది.

ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సాంకేతిక నిపుణుల `పర్ఫెక్షనిజం` అని గుస‌గుస వినిపిస్తోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతం- బీజీఎం విషయంలో రాజీ పడకుండా సమయం తీసుకుంటుండగా.. దర్శకుడు బుచ్చిబాబు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇంకా ఒక పాట చిత్రీకరణతో పాటు కొన్ని కీలకమైన పనులు పెండింగ్‌లో ఉండటంతో పర్ఫెక్షన్ కోసం సినిమాను వాయిదా వేసే అవకాశం ఉందా? అన్న సందేహాలున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబు ఈ పనులను వేగవంతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

అడ్వాన్స్ బుకింగ్‌లు కనీసం ఏప్రిల్ రెండో వారంలోనైనా ప్రారంభం కావాలని బయ్యర్లు కోరుతున్నారు. ఒకవేళ ఏప్రిల్ 8వ తేదీ నాటికి పరిస్థితులు అనుకూలించక `పెద్ది` తన ఏప్రిల్ 30 స్లాట్‌ను వదులుకుంటేఆ తేదీని దక్కించుకోవడానికి స్వయంభు, మా ఇంటి బంగారం వంటి చిత్రాలు విడుద‌ల‌కు వ‌చ్చే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

రామ్ చరణ్ కెరీర్‌కు `పెద్ది` ఎందుకు కీలకం?

`గేమ్ ఛేంజర్` ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో రామ్ చరణ్‌కు `పెద్ది` చిత్రం అత్యంత కీలకమైన కంబ్యాక్ మూవీగా మారింది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత తన మార్కెట్‌ను నిలబెట్టుకోవాలన్నా.. పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటాలన్నా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడం చరణ్‌కు ఇప్పుడు అనివార్యం. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో చరణ్ చాలా పట్టుదలగా ఉన్నారు. చిన్నపాటి కంటి గాయమైనా లెక్కచేయకుండా షూటింగ్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

భవిష్యత్తులో ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి అగ్ర దర్శకులతో భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్న నేపథ్యంలో, `పెద్ది` సాధించే ఫలితం ఆ సినిమాలపై.. చరణ్ మార్కెట్ వాల్యూపై ప్రభావం చూపుతుంది. బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి నిరూపించుకుంటేనే తదుపరి చిత్రాలకు మరింత క్రేజ్ లభించే అవకాశం ఉంది. అందుకే ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోవడమే కాకుండా అత‌డి తదుపరి ప్రయాణానికి దిక్సూచిగా మారనుంది.