పెద్ది రికార్డులు సృష్టిస్తున్న వేళ రంగస్థలంపై చర్చ!
పెద్దిలో ఆయన చూపించిన డెడికేషన్, ఆ పాత్ర కోసం పడిన శ్రమ, ఎమోషనల్ సన్నివేశాల్లో కనబరిచిన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ ప్రశంసల మధ్య మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. అదే రంగస్థలం సినిమా గురించి.
By: Sravani Lakshmi Srungarapu | 5 Jun 2026 6:00 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది. సినిమా రిలీజైన తర్వాత సోషల్ మీడియా, సినీ వర్గాలు, అభిమానుల మధ్య ఎక్కువగా వినిపిస్తున్న అంశం కథ, కలెక్షన్లు కంటే చరణ్ నటన గురించే కావడం విశేషం. పెద్దిలో ఆయన చూపించిన డెడికేషన్, ఆ పాత్ర కోసం పడిన శ్రమ, ఎమోషనల్ సన్నివేశాల్లో కనబరిచిన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ ప్రశంసల మధ్య మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. అదే రంగస్థలం సినిమా గురించి.
చాలా మంది ప్రేక్షకులు పెద్దిలో చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అయితే పెద్ది సినిమాలో చరణ్ యాక్టింగ్, ఆయన పడిన శ్రమ గొప్పదైనప్పటికీ, ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో నటుడిగా అత్యున్నత స్థాయిని చూపించిన సినిమా మాత్రం రంగస్థలం అనే చెప్పాలి. దానికంటే ముందు మగధీరలో చరణ్ మంచి నటన చేసినప్పటికీ, తర్వాత ఆర్ఆర్ఆర్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, చరణ్ యాక్టింగ్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చే సినిమా మాత్రం రంగస్థలంనే.
2018లో రిలీజైన రంగస్థలంలో చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, బాడీ లాంగ్వేజ్, గ్రామీణ యువకుడి అమాయకత్వాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ చరణ్ కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాతో చరణ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విదేశీ మీడియా, అంతర్జాతీయ సినీ వేదికలు, గ్లోబల్ ప్రేక్షకులు ఆయన యాక్టింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ నడుస్తోంది. రంగస్థలం సినిమా కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత లేదా, ప్రస్తుత కాలంలో రిలీజై ఉంటే దాని ప్రభావం ఎంత భారీగా ఉంటుందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
సినీ విశ్లేషకులు, అభిమానుల అభిప్రాయం ప్రకారం రంగస్థలం రిలీజైన సమయంలో చరణ్‌కు దేశవ్యాప్త గుర్తింపు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఉన్న గ్లోబల్ రీచ్ మాత్రం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ మార్కెట్ భారీగా పెరిగింది. ఉత్తర భారతదేశం నుంచి విదేశీ మార్కెట్ల వరకు చరణ్ సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. అలాంటి సమయంలో రంగస్థలం లాంటి స్ట్రాంగ్ కంటెంట్, భావోద్వేగాలు, నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా రిలీజై ఉంటే దాని కలెక్షన్లు పూర్తిగా భిన్నంగా ఉండేవని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొందరు అభిమానులు అయితే ఆ సినిమా ఇప్పుడు రిలీజై ఉంటే ఈజీగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ అయినప్పటికీ, దానిలోని ఎమోషన్స్, క్యారెక్టర్ల డెప్త్, సుకుమార్ టేకింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని వారు వాదిస్తున్నారు.
అయితే ఈ డిస్కషన్ లో మరో యాంగిల్ కూడా ఉంది. ప్రతి సినిమా తన కాలానికి అనుగుణంగా ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రంగస్థలం రిలీజైనప్పుడు ఆ సినిమా సృష్టించిన సంచలనం, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన విజయాన్ని కేవలం నెంబర్స్ తో మాత్రమే కొలవలేమని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పెద్ది విజయంతో చరణ్ నటుడిగా మరో మెట్టు ఎక్కినా, చిట్టిబాబు పాత్రను పూర్తిగా అధిగమించాడా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా సమయం అవసరమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ది విజయం కేవలం కొత్త రికార్డుల గురించి మాత్రమే కాకుండా, రామ్ చరణ్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలపై మళ్లీ చర్చ మొదలుపెట్టింది. ఆ చర్చలో రంగస్థలం పేరు మరోసారి కేంద్రబిందువుగా మారడం, ఆ సినిమా ప్రభావం ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పకనే చెబుతోంది.
