చరణ్ కి నేషనల్ అవార్డ్.. చిరు ఏమన్నారో తెలుసా?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 24 Jun 2026 9:38 AM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, సినిమాపై నా, రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ ప్రదర్శించిన అద్భుత నటనకు, ప్రేక్షకులనుండి లభిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలు- గుర్తింపు.. ప్రపంచంలోని ఏ అవార్డు కంటే కూడా చాలా పెద్దవని చిరంజీవి కొనియాడారు. వెండితెరపై చరణ్ పడ్డ కష్టానికి లభించిన అసలైన ప్రతిఫలం ఇదేనని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి `పెద్ది` సినిమా చూస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభూతిని ఎంతో భావోద్వేగంగా పంచుకున్నారు. నేను `పెద్ది` సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూశాను. అందులోని పాత్రలతో పాటు ట్రావెల్ అయ్యాను. ఆ సినిమాలో ఉన్న భావోద్వేగాలను మనస్ఫూర్తిగా అనుభూతి చెందాను. ఈ సినిమాను ఎంత రిచ్‌గా తీశారు? దర్శకుడు ఎవరు? హీరో ఎవరు? వంటి విషయాలను నేను అస్సలు పట్టించుకోలేదు.. అవేవీ నన్ను ఆకర్షించలేదు. కేవలం ఈ సినిమా కథలోని ఒక ఇంటీరియర్ గిరిజనుల బాధలు, కష్టాలు, వారి పోరాటం, భావోద్వేగ ప్రయాణంలో లీనమై సినిమాను ఆస్వాధించాను! అంటూ బుచ్చిబాబు సానా మలిచిన కథను చిరంజీవి ఆకాశానికెత్తారు.
ప్రజలు ఇచ్చినదే ఉత్తమమైన అవార్డ్!
మీరంతా నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటన అంటున్నారంటే.. ఆ స్థాయిలో చరణ్ మీకు నచ్చాడు. అవార్డులు రావొచ్చు.. రాకపోవచ్చు.. ప్రజల మనసును గెలుచుకోవడమే ఉత్తమమైన అవార్డ్! దర్శకుడు సుకుమార్ నాతో అన్నారు.. అవార్డ్ స్థాయి పెర్ఫామెన్స్ ఇది అని.. ప్రజలు ఇచ్చినదే ఉత్తమమైన అవార్డ్!.. అని చిరు ఎమోషనల్ అయ్యారు. రంగస్థలం చిత్రంతోనే అవార్డ్ వస్తుందని సుకుమార్ అన్నారు.. కానీ ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే అసలైన అవార్డ్ అని చిరు అన్నారు.
చరణ్ పరిపూర్ణతతో ఆకట్టుకున్నాడు:
బిడ్డ గురించి మాట్లాడటం అంటే.. ఒక తోటి నటుడిగా ఒక సీనియర్ నటుడిగా ఇలాంటి ఇంటెన్సిటీ హై డ్యాన్సులు యాక్షన్ సీన్స్ తో ఎమోషన్స్ పండిస్తూ ఒక ఆర్టిస్టుగా ఎన్ని కోణాలు ఉండాలో అన్నీ పరిపక్వతో చూపించిన చరణ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తండ్రిగా గర్వపడుతున్నాను. సుకుమార్ రంగస్థలంలో వ్వావ్ ఎంత బాగా చేసాడు. అద్భుతంగా చేసాడు అనుకున్నాం. అలాంటి రంగస్థలం లాంటివి రావాలంటే ఎంత కాలం పడుతుందో ఆర్టిస్టుగా నిలబడాలంటే .. రాజమౌళి మగధీర, ఆర్.ఆర్.ఆర్, సుకుమార్ రంగస్థలం లాంటివి వస్తాయి.. ఇప్పుడు పెద్ది వచ్చింది.
నేను సినిమా చూస్తున్నంత సేపూ.. పెద్ది కనిపించాడు కానీ చరణ్ కనిపించలేదు. పాత్రను ఔపోషణ పట్టి దర్శకుడిని నమ్మి చరణ్ ఇచ్చాడు. కఠోర సంకల్పంతో చేసాడు. ఇంతమందితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాతో చరణ్ మనల్ని సంతోష పెట్టాడు. ఆనందంగా గంతులేయించాడు. బాధపెట్టాడు. ఆఖరికి విజయం సాధించాడు. ఎన్ని రకాలుగా చూసినా పెద్ది పాత్రలో రాణించిన విధానానికి అభినందిస్తున్నాను. ఆర్టిస్టు తన పాత్రను వోన్ చేసుకుని ఫీల్ అవ్వాలి తప్ప.. కేవలం ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్, మజిల్స్ తో రాణించాలనుకునేది కరెక్ట్ కాదు.. తన మనసులో అంతర్గతంగా ఫీల్ అయ్యి కళ్లలోనే చూపిస్తూ చరణ్ పరిపూర్ణతతో ఆకట్టుకున్నాడు.
ఇదే వేదికపై చిరంజీవి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. చరణ్ ఎదుగుదలను చూశాక తాను ఇక కాస్త వెనక్కి తగ్గి, చరణ్‌ను ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే దీని అర్థం తాను నటనకు స్వస్తి పలకడం కాదని... నటుడిగా సినిమాలు చేయడం ఎప్పటికీ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. చరణ్ సాధిస్తున్న విజయాలను చూసి ఒక తండ్రిగా చిరంజీవి కళ్లలో కనిపించిన ఆనందం సక్సెస్ మీట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సక్సెస్ వేదికపై చిరంజీవి, రామ్ చరణ్ మధ్య జరిగిన ఈ ముచ్చటైన తండ్రీకొడుకుల సత్కారం మెగా అభిమానులకు కంటి నిండా ఆనందాన్ని ఇచ్చింది. అటు బాక్సాఫీస్ వసూళ్లతో... ఇటు సాక్షాత్తూ మెగాస్టార్ ప్రశంసలతో `పెద్ది` చిత్రం చరణ్ కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
