పెద్ది పహిల్వాన్ గ్లింప్స్: రామ్ చరణ్ ఊరమాస్ ట్రాన్స్‌ఫార్మేషన్
ఈ గ్లింప్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి. ఒక పహిల్వాన్ పాత్ర కోసం తన శరీరాన్ని మార్చుకున్న తీరు అద్భుతం.
By: M Prashanth | 27 March 2026 10:29 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి ‘పహిల్వాన్ గ్లింప్స్’ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటివరకు మనం చూసిన చరణ్ ఒక ఎత్తు, ఈ సినిమాలో కనిపిస్తున్న చరణ్ మరో ఎత్తు అని చెప్పక తప్పదు. కేవలం నిమిషం లోపు ఉన్న ఈ వీడియో, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో శాంపిల్ చూపించింది.
ఈ గ్లింప్స్‌లో విజువల్స్ ఎంత బాగున్నాయో, డైలాగ్స్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. "కుస్తీ అంటే.. బంతితో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట!" అంటూ వచ్చే డైలాగ్ సినిమాలోని కంటెంట్ ని హైలెట్ చేస్తోంది. హీరో ఒక్క క్రికెట్ తోనే కాదు ప్రతీ ఆటలో పొగరు చూపించేలా ఇన్నాడు. "చూడమే.. ఆటే నా పొగరు!" అనే మాట వింటుంటే కంటెంట్ పై క్లారిటీ వస్తోంది.
ఈ గ్లింప్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి. ఒక పహిల్వాన్ పాత్ర కోసం తన శరీరాన్ని మార్చుకున్న తీరు అద్భుతం. కండలు తిరిగిన దేహం, ఆ గంభీరమైన నడక చూస్తుంటే ఈ పాత్ర కోసం చరణ్ ఎంతలా కష్టపడ్డారో అర్థమవుతోంది. ముఖ్యంగా గద పట్టుకుని ప్రాక్టీస్ చేసే సీన్లు, ఆంజనేయ స్వామి రూపాన్ని తలపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా బల్కీగా, పక్కా లోకల్ మాస్ లుక్‌లో చరణ్ కనిపిస్తున్నారు.
సినిమా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘చికిరి’, ‘రా రాయ్’ వంటి పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ కాగా, ఈ గ్లింప్స్‌లో వినిపించిన మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా, సహజంగా చూపించింది. కుస్తీ పోటీలు, ఆ మట్టి వాసన ఉట్టిపడేలా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’ తర్వాత తన రెండో సినిమానే ఇంత భారీ స్పోర్ట్స్ డ్రామాగా ఎంచుకోవడం విశేషం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో ఒక ఎమోషనల్ జర్నీ కూడా ఉండబోతోందని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. జగపతిబాబు, శివరాజ్ కుమార్ వంటి స్టార్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉండటంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ‘పెద్ది’ ఇండియన్ స్క్రీన్ పై ఒక సరికొత్త విజువల్ వండర్ కాబోతోందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
చరణ్ ఫిట్నెస్ విషయానికి వస్తే, 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా చూపిస్తున్న డెడికేషన్ మాములుగా లేదు. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన డైట్ కఠినమైన వర్కవుట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ లా మారడానికి తీసుకున్న శిక్షణ ప్రతి సీన్ లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, ఈ గ్లింప్స్ తో అంచనాలను అమాంతం పెంచేసింది. గ్లోబల్ స్థాయిలో చరణ్ కు ఉన్న క్రేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది.
