'పుష్ప' బాటలో 'పెద్ది'
బాహుబలి లాంటి ఈవెంట్ ఫిలిం నార్త్ ఇండియాలో అంత గొప్పగా ఆడడం పెద్ద విషయం కాదు కానీ.. ఏ అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప తరహా సగటు మాస్ మూవీ ఆ స్థాయిలో హిందీ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం ఆశ్చర్యమే
By: Garuda Media | 9 May 2026 11:09 PM ISTఉత్తరాదిన సెన్సేషన్ క్రియేట్ చేసిన దక్షణాది చిత్రాల్లో పుష్ప ఒకటి. బాహుబలి లాంటి ఈవెంట్ ఫిలిం నార్త్ ఇండియాలో అంత గొప్పగా ఆడడం పెద్ద విషయం కాదు కానీ.. ఏ అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప తరహా సగటు మాస్ మూవీ ఆ స్థాయిలో హిందీ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం ఆశ్చర్యమే. ఈ గుర్తింపును ఉపయోగించుకుని పుష్ప 2 చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది సుకుమార్ అండ్ టీం. బాహుబలి-2కు దగ్గరగా ఈ చిత్రం వసూళ్లు రాబట్టడం విశేషం. పుష్ప 2ను ఉత్తరాదిన ఎంత భారీగా ప్రమోట్ చేశారో తెలిసిందే. ముఖ్యంగా బీహార్లో చేసిన ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందిం బాహుబలి-2కు కూడా ఆ స్థాయి ఈవెంట్ చెయ్యలేదు. ఐతే పుష్ప-2 తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ తెచ్చుకున్న పెద్ది సినిమాకు కూడా నార్త్ ఇండియాలో గట్టిగా ప్రమోషన్లు చెయ్యాలని చూస్తున్న చిత్ర బృందం.. పుష్ప-2 తరహాలోనే ఒక ఈవెంట్ చెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 16న పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉత్తరాదినే చెయ్యాలని టీమ్ చూస్తోందట. అందుకు మధ్యప్రదేశ్ లోని భోపాల్ ను వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈవెంట్ పరంగా పుష్ప-2 భారీతనాన్ని అందుకోవడం కష్టం. కానీ ఈ ఈవెంట్ కూడా పెద్ద స్థాయిలోనే చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా పాల్గొంటాడట. ఆయన ఈ ఈవెంట్లో తన టీంతో కలిసి పెద్ది పాటలను కూడా పెర్ఫార్మ్ చేస్తాడట. రెహమాన్ నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చికిరి పాట తెలుగులో ఎంత హిట్ అయిందో హిందీలో సైతం అంతే హిట్ అయింది. ఈ పాటను పెర్ఫార్మ్ చేస్తే రెస్పాన్స్ వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈవెంట్ బాగా చేస్తే ఉత్తరాదిన సినిమాకు ఇంకా మంచి హైప్ వచ్చి ఓపెనింగ్స్ కు ఉపయోగ పడుతుంది. పెద్ది జూన్ 4న విడుదల కానుండగా.. ముందు రోజు సాయంత్రం నుంచే దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.
