Begin typing your search above and press return to search.

నార్త్ USలో పెద్ది.. అప్పుడే అంతటి వసూళ్లా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది.. ఓవర్సీస్ మార్కెట్‌ లో అప్పుడే సంచలనం సృష్టిస్తోంది.

By:  M Prashanth   |   11 May 2026 1:03 PM IST
నార్త్ USలో పెద్ది.. అప్పుడే అంతటి వసూళ్లా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది.. ఓవర్సీస్ మార్కెట్‌ లో అప్పుడే సంచలనం సృష్టిస్తోంది. స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఆ భారీ బడ్జెట్ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. అమెరికా ప్రీమియర్స్‌ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి.

సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలకు పైగా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా ప్రీమియర్స్‌ కు ఇప్పటివరకు 7,500కు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. యూఎస్ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ దాదాపు 1.96 లక్షల డాలర్లకు చేరుకోగా.. మొత్తం నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ 2.14 లక్షల డాలర్ల మార్క్ దాటేశాయి!

ఇంకా సినిమా ప్రమోషన్స్ కంప్లీట్ గా స్టార్ట్ కాకముందే ఆ రేంజ్ లో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదని చెప్పాలి. మూవీని నార్త్ అమెరికాలో ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ భారీ స్థాయిలో విడుదల చేయనుంది. జూన్ 3న అమెరికా వ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 300కు పైగా లొకేషన్లలో వెయ్యికి పైగా షోలు లాక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రీమియర్స్ నాటికి బుకింగ్స్ మరింత వేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పెద్దిపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు రామ్ చరణ్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో రూపొందుతున్న ఆ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తో తెరకెక్కుతోంది. ఇందులో చరణ్ పవర్‌ ఫుల్ పహిల్వాన్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై హైప్‌ ను మరింత పెంచాయి. సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జగపతిబాబు, వీజీ చంద్రశేఖర్, రజత్ దత్తా, సత్య తదితరులు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం ఉండటంతో సినిమాపై అన్ని భాషల్లో కూడా ఆసక్తి నెలకొంది.

సాంకేతికంగా కూడా పెద్ది భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది. ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి నిర్వహిస్తున్నారు. నిర్మాతలుగా వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా వ్యవహరిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సినిమాను సమర్పిస్తున్నాయి. తెలుగు సహా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుండటంతో పెద్ది ఓవర్సీస్ మార్కెట్‌ లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కచ్చితంగా ఉంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.