బిడ్డొచ్చిన వేళ జాతీయ అవార్డ్...చరణ్‌కి కూడా ఛాన్సుందా?
భారతీయ సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన తారలు తమ ప్రదర్శనతో మెప్పించినా.. కొందరికి మాత్రమే జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు వస్తుంటాయి.
By: Sivaji Kontham | 22 July 2026 9:44 AM ISTభారతీయ సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన తారలు తమ ప్రదర్శనతో మెప్పించినా.. కొందరికి మాత్రమే జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు వస్తుంటాయి. అయితే వ్యక్తిగత కుటుంబ జీవితంలో పిల్లలు పుట్టిన తర్వాత లేదా తండ్రిగా ప్రమోటయ్యాకే కెరీర్‌లో అతిపెద్ద విజయాలు వస్తాయనే ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే విషయంలో ఇదే రుజువు కావడంతో.. ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందా? అనే ఆసక్తికర చర్చ అభిమానుల్లో మొదలైంది.
విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే, 'ట్వల్త్ ఫెయిల్' చిత్రంలో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ పాత్రలో చూపించిన కళాత్మక నటనకు గాను 'ఉత్తమ నటుడు'గా జాతీయ పురస్కారాన్ని అందుకొని తన కెరీర్‌లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న అనంతరం విక్రాంత్ మాట్లాడుతూ... ఈ విజయానికి తన కుమారుడు వర్దాన్ తెచ్చిన అదృష్టమే ప్రధాన కారణమని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతీ చిన్నారి తన స్వీయ అదృష్టాన్ని.. దీవెనలను వెంట తెచ్చుకుంటాడనేది తమ కుటుంబంలో నమ్ముతారని.. వర్దాన్ రాకతోనే తన జీవితంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సరిగ్గా విక్రాంత్ మాస్సే తరహాలోనే టాలీవుడ్ హీరో రామ్ చరణ్- ఉపాసన దంపతులు కూడా కవలలకు (ఒక కుమారుడు, ఒక కుమార్తె) జన్మనిచ్చి నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టారు. సాధారణంగా పిల్లల రాక కుటుంబాల్లో సంతోషాన్ని తేవడమే కాకుండా.. నటుల కెరీర్ పరంగా కూడా సరికొత్త శక్తిని ఇస్తుందనే నమ్మకం బలంగా ఉంది. చరణ్ విషయంలో కూడా ఈ సంతాన భాగ్యం కలిగిన తర్వాత అతడిలో ఎనర్జీ పదింతలైంది. ఇటీవలి కాలంలో అతడి నటన, ప్రాజెక్టుల ఎంపిక మరింత విశిష్టంగా మారిందనడంలో సందేహం లేదు.
బిడ్డొచ్చిన వేళ.. ఆ శుభసమయం తర్వాతే రామ్ చరణ్ `పెద్ది` రూపంలో ఒక భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో చరణ్ కనబరిచిన నటన, భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయని.. అతడికి కచ్చితంగా జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్శకుడు సుకుమార్‌తో పాటు సినీ ప్రముఖులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. `రంగస్థలం` తర్వాత చరణ్ నటనలోని మరో కోణాన్ని `పెద్ది` ఆవిష్కరించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బాక్సాఫీస్ కలెక్షన్లను మించి అతడి కష్టానికి గుర్తింపు దక్కింది. చరణ్ నటనకు పరిశ్రమ, ప్రజలే అవార్డులిచ్చేసారని మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.
విక్రాంత్ మాస్సేకి కొడుకు వర్దాన్ రాకతో నేషనల్ అవార్డు దక్కినట్లే.. బిడ్డలొచ్చిన వేళ రామ్ చరణ్‌కి కూడా కలిసి వచ్చి అత్యున్నతమైన `జాతీయ అవార్డు` దక్కే అవకాశం ఉందేమోనని మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 'రంగస్థలం'తోనే రావాల్సినది మిస్సయింది.. కానీ 'పెద్ది'తో అది సాధ్యమేనని అంచనా వేస్తున్నారు! సెంటిమెంట్లను పక్కనపెట్టినా.. 'పెద్ది' కోసం చరణ్ పడ్డ కష్టానికి .. అసాధారణ నటప్రతిభకు ఈ అవార్డు రావడం దాదాపు ఖాయమనని అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చరణ్‌కి జాతీయ అవార్డును మించిన కితాబు ప్రేక్షకులే ఇచ్చేసారని విశ్లేషిస్తున్నారు. చరణ్ తదుపరి సుకుమార్ దర్శకత్వంలో నటించడానికి సర్వసన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
