'పెద్ది' స్పెషల్ సాంగ్.. బ్యాక్ గ్రౌండ్ లో అసలేం జరుగుతోంది?
తాజాగా సినిమా స్పెషల్ ఐటెం సాంగ్ విషయంలో ఆలస్యం చర్చనీయాంశంగా మారింది. ఈ వారం భారీ సెట్లో పాటను చిత్రీకరించాలని యూనిట్ ప్లాన్ చేసింది.
By: M Prashanth | 12 April 2026 11:01 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ భారీ బడ్జెట్ చిత్రం టాలీవుడ్ లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. అయితే గత కొన్ని రోజులుగా ఆ సినిమా షూటింగ్ కు సంబంధించిన పరిణామాలు అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాలి.
గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ కు గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన సినిమా కావడంతో పెద్దిపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ఉప్పెనతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనాకు ఇది రెండో సినిమా కావడంతో ఇండస్ట్రీ దృష్టంతా ఆ ప్రాజెక్టుపైనే ఉంది. ప్రస్తుతానికి ఏప్రిల్ 30న సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, షూటింగ్ లో జరుగుతున్న మార్పులు ఆ తేదీపై ప్రభావం చూపుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా సినిమా స్పెషల్ ఐటెం సాంగ్ విషయంలో ఆలస్యం చర్చనీయాంశంగా మారింది. ఈ వారం భారీ సెట్లో పాటను చిత్రీకరించాలని యూనిట్ ప్లాన్ చేసింది. ఆ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని భావించిన మేకర్స్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో ఆ పాట కోసం హీరోయిన్ ఎంపిక ఇంకా ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ ను వాయిదా వేయాల్సి వచ్చినట్లు సమాచారం.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు ప్రముఖ హీరోయిన్లను ఎంపిక చేయడం ట్రెండ్ గా మారింది. చరణ్ సినిమా అంటే ఆ పాటకు కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఆ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సాంగ్ ఎనర్జీకి సరిపోయే హీరోయిన్ ఎంపికలో ఇంకా స్పష్టత రాకపోవడంతో యూనిట్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది.
ఆ పాట కోసం మొదటగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించగా, ఆ తర్వాత మానస వారణాసి సహా మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా ఖరారు చేయలేదని తెలుస్తోంది. దీంతో సాంగ్ విషయంలో అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అసలు బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరుగుతుందోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, హీరో రామ్ చరణ్ వ్యక్తిగత కారణాలతో చిన్న విరామం తీసుకున్నారని సమాచారం. ఇంతలో హీరోయిన్ ఫిక్స్ అయితే స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా పెద్ది విషయంలో వరుస వాయిదాల వల్ల ఒకవైపు నిర్మాణ వ్యయం పెరుగుతుండగా, మరోవైపు సమయం వృధా కావడం వల్ల రిలీజ్ డేట్ పై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తానికి పెద్ది సినిమా స్పెషల్ సాంగ్ ఎప్పుడు పూర్తవుతుందో? అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు మూవీ వస్తుందో? లేదో? అన్న ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
