పెద్ది అసలు గుట్టు విప్పిన అవినాష్.. షాక్ అవ్వాల్సిందే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పీరియడ్ డ్రామా 'పెద్ది' మీద అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
By: M Prashanth | 6 May 2026 11:46 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పీరియడ్ డ్రామా 'పెద్ది' మీద అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జూన్ 4న సినిమా విడుదల కాబోతున్న తరుణంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. ముఖ్యంగా ఈ సినిమా విజువల్స్, అందులో కనిపించే నేచురాలిటీ గురించి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం అవినాష్ చేతిలో చిరంజీవి గారి సినిమాతో పాటు 'పారడైజ్' వంటి మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఈ సినిమా చాలా స్పెషల్ అని వివరించారు. సినిమా కోసం దాదాపు 24 భారీ సెట్లు వేసినా, అవి సెట్స్ అని ఎవరూ గుర్తుపట్టలేరని ఆయన కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమా జర్నీ గురించి అవినాష్ మాట్లాడుతూ.. మొదట బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడు తాను ఒక ఇరవై నిమిషాల పాటు వేరే లోకంలోకి వెళ్లిపోయానని చెప్పారు.
కథలోని ఎమోషన్ అంతలా కదిలించిందని, అందుకే తన పదేళ్ల కెరీర్‌లో ఈ ప్రాజెక్ట్ అత్యంత స్పెషల్ అని పేర్కొన్నారు. కేవలం కథ విన్నప్పుడే కలిగిన ఆ ఎక్సైట్‌మెంట్, రేపు థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఫీల్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఈ సినిమా కోసం విజయనగరం వీధులు, క్లాక్ టవర్ వంటి ప్రాంతాలను 70, 80ల నాటి వాతావరణం ప్రతిబింబించేలా రీక్రియేట్ చేసినట్లు వెల్లడించారు.
సాధారణంగా పీరియడ్ సినిమాల్లో సెట్స్ కనిపిస్తుంటాయి, కానీ 'పెద్ది'లో మాత్రం ప్రతిదీ సహజంగా ఉంటుందని అవినాష్ వివరించారు. ఈ సినిమా కోసం వేసిన చెరుకు ఫ్యాక్టరీ సెట్ కానీ, హిల్ స్టేషన్ సెట్ కానీ చూసి ఇవి హైదరాబాద్‌లోనే వేశారా అని ఆశ్చర్యపోతారని ఆయన చెప్పారు. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రి ప్రొడక్షన్ పనులకే కేటాయించి, ప్రతి లోకేషన్‌ను ఓపెన్ గ్రౌండ్‌లోనే తీర్చిదిద్దారు. నేచురల్ లైటింగ్ వాడుకోవడం వల్ల సినిమా రియలిస్టిక్ గా వచ్చిందని ఆయన అన్నారు.
అలాగే కుస్తీ పోటీల కోసం అండర్‌గ్రౌండ్ లో డిజైన్ చేసిన సెటప్ ఒక హైలైట్ గా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా అవినాష్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు చరణ్ కు గాయం అయినా, ఆర్టిస్టుల డేట్స్ ఇబ్బంది కాకూడదని మళ్ళీ వెంటనే సెట్స్ కు వచ్చి పనిచేశారని ఆయన గొప్పగా చెప్పారు.
సినిమాలో హీరో వాడే బ్యాట్ కూడా చాలా నేచురల్ గా ఉంటుందని, ఒక లోకల్ ఆటగాడు తన సొంత పరికరాలతో తయారు చేసుకునే బ్యాట్ ఎలా ఉంటుందో అలాగే డిజైన్ చేసినట్లు వెల్లడించారు. సుకుమార్ అన్నట్లుగానే చరణ్ నటన ఇందులో రంగస్థలం సినిమాను మించి ఉంటుందని అవినాష్ కొనియాడారు. చివరగా 'పెద్ది' ఒక అరుదైన చిత్రమని, సినిమా ముగిసి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని అవినాష్ ఎమోషనల్ అయ్యారు. ఆడియన్స్ ఆ పీరియడ్ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. డీవోపీ రత్నవేలుతో తనకున్న సింక్ వల్ల అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని, విజయనగరం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రూరల్ డ్రామా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ముగించారు.
