'పెద్ది' సీన్స్.. మేకర్స్ కొత్త ప్లాన్? సాధ్యమేనా?
ఇప్పుడు కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 9 Jun 2026 4:01 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. జూన్ 4న విడుదలైన ఆ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. అయితే సినిమా సక్సెస్ కొనసాగుతున్న వేళ.. ఇప్పుడు కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ కొత్త ప్లాన్ సిద్ధం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో రన్ టైమ్ ఎక్కువగా ఉందని, కొన్ని సీన్స్ స్టోరీ ఫ్లోను తగ్గించాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోషించిన గౌర్నాయుడు రోల్ కు సంబంధించిన కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ను తొలగించి, రామ్ చరణ్- జగపతిబాబు మధ్య ఉండే మరికొన్ని కీలక సన్నివేశాలను యాడ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. మేకర్స్ ప్లాన్ వేసుకోవడం ఒక ఎత్తయితే.. అది ఇప్పుడు అమలు కావడం మరో ఎత్తు. ఎందుకంటే ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని థియేటర్లలో నడుస్తున్న సినిమాకు కొత్త సీన్స్ యాడ్ చేయాలంటే మళ్లీ సెన్సార్ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వెర్షన్ కు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యాకే డిజిటల్ కాపీలను థియేటర్లకు పంపించాలి. వేలాది స్క్రీన్లలో పాత వెర్షన్ ను తొలగించి కొత్త వెర్షన్ ను అప్లోడ్ చేయడం కూడా చిన్న విషయం కాదు.
అందుకే ఆ ప్రచారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మాత్రం పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి మార్పులు కామన్ అని చెబుతున్నారు. గతంలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఆధారంగా కొన్ని మూవీల రన్ టైమ్ తగ్గించడం, కొన్ని సీన్స్ తొలగించడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే పూర్తిగా కొత్త సీన్స్ యాడ్ చేసి, మళ్లీ సెన్సార్ చేయించి, అన్ని థియేటర్లలో కొత్త వెర్షన్ ను ప్రదర్శించడం అనేది టైమ్ తీసుకునే ప్రాసెస్.
మరోవైపు.. పెద్ది ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. వసూళ్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్న సమయంలో మేకర్స్ ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటారా? అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రెండో వారంలోకి అడుగుపెడుతున్న వేళ నిజంగా మార్పులు చేస్తారా? లేక అది రూమర్ గా మిగిలిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఇప్పటి వరకు ఆ వార్తలపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో పెద్ది కొత్త వెర్షన్ నిజంగానే థియేటర్లలోకి వస్తుందా? లేక ఇది కేవలం టాక్ మాత్రమేనా? అన్నది వేచి చూడాల్సిందే. ఏదేమైనా మేకర్స్ కొత్త ప్లాన్ వేశారనేది నిజమే కావొచ్చు.. కానీ కటింగ్, కొత్త సీన్స్ యాడింగ్, రీ సెన్సార్, థియేటర్లలో రీ అప్లోడ్ వంటి పనులు ఇప్పట్లో పూర్తి కావడం అంత ఈజీ కాదనే అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
