'పెద్ది' చూసేందుకు హైదరాబాద్ కు ఇద్దరు జపనీస్ మహిళలు
ఈ విషయాలన్ని అందరికి తెలిసిందే. అయితే.. ఎవరికి తెలియని మరో విషయం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. వారిద్దరి గురించి తెలిసిన వారంతా ఔరా అనుకోకుండా ఉండలేకపోతున్నారు.
By: Garuda Media | 3 Jun 2026 10:49 AM ISTఅవును.. రాంచరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. గురువారం గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ మూవీ ఫ్యాన్స్ షోను ఈ రోజు (బుధవారం) రాత్రి 8 గంటల షో నుంచి ప్రత్యేకంగా వేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం తెలిసిందే. ఈ విషయాలన్ని అందరికి తెలిసిందే. అయితే.. ఎవరికి తెలియని మరో విషయం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. వారిద్దరి గురించి తెలిసిన వారంతా ఔరా అనుకోకుండా ఉండలేకపోతున్నారు.
రాంచరణ్ కు డైహార్ట్ ఫ్యాన్స్ పాన్ ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. పలువురు జపనీయులు రాంచరణ్ ను విపరీతంగా అభిమానిస్తారు. అంతకుమించి ఆరాధిస్తారు. తాజాగా విడుదలవుతున్న రాంచరణ్ పెద్ది సినిమాను చూసేందుకు జపాన్ రాజధాని టోక్యో నుంచి హైదరాబాద్ కు వచ్చారు జపాన్ కు చెందిన ఇద్దరు జపనీయులు. ఒక హీరో మీద అభిమానం వారిని దేశాల సరిహద్దులు దాటేలా చేసింది. తెలుగు సినిమా విడుదల వేళ.. అభిమానుల సందడి గురించి తెలుసుకున్న వారు.. తమ అభిమాన కథానాయుడి సినిమాను మిగిలిన అభిమానులతో కలిసి.. ఫ్యాన్స్ షో చూడాలన్నది వారి ఆశ.
అంతేకాదు.. మొత్తం మూడు రోజుల్లో దాదాపు పదిసార్లు చూడాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని మరీ హైదరాబాద్ కు చేరుకోవటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. టోక్యోకు చెందిన రాంచరణ్ వీరాభిమాన మహిళలు మసామీ.. క్రిస్ లు ఇద్దరు తెలుగు తెలిసి.. టోక్యోలో ఉండే కన్మణి అనే మహిళ సాయంతోహైదరాబాద్ కు మంగళవారం మధ్యాహ్నానానికే చేరుకున్నారు.
మరింత షాకింగ్ అంశం ఏమంటే.. ఈ ఇద్దరు జపనీస్ మహిళలకు తమ జపనీస్ భాష తప్పించి.. మరే భాష రాదు. అలాంటప్పుడు సినిమాను ఎలా అర్థం చేసుకుంటారంటే.. దానికి సుదీర్ఘంగా వివరిస్తారు. సీన్ టు సీన్ ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ.. తెర మీద తమ అభిమాన కథానాయకుడ్ని చూసుకొని మురిసిపోతూ సినిమాను ఎంజాయ్ చేయాలన్నది వారి లక్ష్యం. అందుకే.. ఒకసారి చూస్తే సినిమా అర్థమయ్యే అవకాశం తక్కువగా ఉండటంతో.. హైదరాబాద్ లో ఉండే మూడు రోజుల్లో మొత్తం 10 సార్లు పెద్ది సినిమా చూడాలన్నదే వీరి లక్ష్యమని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రాంచరణ్ మీద అభిమానంతో ఇప్పటికే ఒకసారి హైదరాబాద్ కు వచ్చి.. తమ అభిమాన నటుడ్ని కలిసిన వీరిద్దరూ.. తాజాగా తమ హీరో సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టుకొని మరీ హైదరాబాద్ కు చేరుకున్నారు. మరి.. అంత దూరం నుంచి శ్రమ తీసుకొని మరీ వచ్చారు కదా? ఆయన్ను కలుస్తారా? అంటే.. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంటారు.. ఆయన్ను ఇబ్బంది పెట్టటం ఇష్టం లేదని వ్యాఖ్యానించటం విశేషం. తాము అనుకున్నట్లు హైదరాబాద్ లో పదిసార్లు పెద్ది సినిమా చూడటం సాధ్యం కాకుంటే.. తదుపరి గమ్యస్థానమైన చెన్నైలో కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు. టోక్యోలోని తమ ఇండియన్ స్నేహితురాలు కన్మణి సాయంతో వారు హైదరాబాద్ చేరుకున్నారు. భాషకు సంబంధించిన సమస్య ఉండటంతో.. ఆమె వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
పెద్ది సినిమా చూసేందుకు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని మరీ వచ్చిన ఈ ఇద్దరు జపనీస్ మహిళల వైనం చూస్తే.. జపనీయుల అభిమానం ఇంతలా ఉంటుందా? అని అనుకోకుండా ఉండలేం. ఈ సినిమాను చూసే వేళలో.. రాంచరణ్ బొమ్మ ఉన్న టీ షర్టులను ప్రత్యేకంగా తయారు చేయించుకొని మరీ థియేటర్ కు వెళుతున్నట్లు వారు చెబుతున్నారు. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పెద్ది సినిమా కోసం హైదరాబాద్ రావాలన్న ప్లానింగ్ లో భాగంగా.. అందుకు అవసరమైన డబ్బుల కోసం కొన్ని నెలలుగా అదనపు గంటలు పని చేసి.. అలా కూడబెట్టిన డబ్బులతో వచ్చిన వీరిద్దరిని చూస్తే.. అభిమానమా నీకు జోహార్లు అనుకోకుండా ఉండలేం.
