Begin typing your search above and press return to search.

‘లెనిన్’ను ఇరికించేశారే..

టాలీవుడ్లో మరే కొత్త హీరోకూ అరంగేట్రంలో రాని హైప్ అక్కినేని కుర్రాడు అఖిల్‌కు వచ్చింది.

By:  Garuda Media   |   25 April 2026 8:15 AM IST
‘లెనిన్’ను ఇరికించేశారే..
X

టాలీవుడ్లో మరే కొత్త హీరోకూ అరంగేట్రంలో రాని హైప్ అక్కినేని కుర్రాడు అఖిల్‌కు వచ్చింది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’ను మించి.. అఖిల్ డెబ్యూ మూవీ ‘అఖిల్’కు క్రేజ్ కనిపించిందంటే అతిశయోక్తి ఏమీ కాదు. అరంగేట్రానికి ముందే అతను ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ‘అఖిల్’నేరుగా సూపర్ స్టార్ అయిపోతాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించనిది జరిగింది. ‘అఖిల్’ డిజాస్టర్ అయింది. ఇక అప్పట్నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ.. ఫలితం ఉండట్లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో కాస్త కుదురుకున్నట్లే కనిపించినా.. ‘ఏజెంట్’తో మళ్లీ పాతాళానికి పడిపోయాడు. ఇప్పుడిక తన ఆశలన్నీ ‘లెనిన్’ మీదే ఉన్నాయి. కానీ ఈ సినిమాకు రిలీజ్ విషయంలో తలనొప్పులు తప్పట్లేదు. ఏప్రిల్ 30న ‘పెద్ది’తో వస్తున్న రామ్ చరణ్ కోసం అఖిల్ తన సినిమాను మే 1 నుంచి వాయిదా వేసుకుంటుున్నట్లు ప్రకటించుకున్నారు కానీ.. ఇందులో త్యాగం ఏమీ లేదని కొన్ని రోజులకే తేలిపోయింది. ‘పెద్ది’ వాయిదా పడ్డా సరే.. మే 1న ‘లెనిన్’ను రిలీజ్ చేయలేని పరిస్థితి కనిపించేసరికి అసలు విషయం జనాలకు అర్థమైపోయింది. దీంతో అనవసర నెగెటివిటీ ముసురుకుంది ‘లెనిన్’ చుట్టూ.

మే 1 నుంచి వాయిదా వేసినపుడు ‘లెనిన్’ కోసం ఎంచుకున్న కొత్త డేట్ జూన్ 25. కానీ ఇప్పుడు ‘పెద్ది’ కొత్త డేట్‌ అదే కావచ్చని జోరుగా వార్తలు వస్తున్నాయి. ముందు ‘టాక్సిక్’ జూన్ 4 నుంచి వాయిదా పడుతుందేమో ఆ డేట్‌కు వద్దామని ‘పెద్ది’ టీం అనుకుంది. కానీ ‘టాక్సిక్’ వాయిదా ఉండదని.. చెప్పిన డేటుకే వచ్చేస్తుందని తాజాగా సమాచారం అందడంతో.. ఆ సినిమా నుంచి మూడు వారాల గ్యాప్ తీసుకుని జూన్ 25న తమ సినిమాను రిలీజ్ చేయాలని ‘పెద్ది’ టీం ఫిక్సయినట్లే కనిపిస్తోంది. ‘లెనిన్’ గురించి ఆలోచించే పరిస్థితిలో ‘పెద్ది’ టీం లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఇటు ట్రేడ్.. అటు ఆడియన్స్.. మొత్తంగా ఇండస్ట్రీనే ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ‘పెద్ది’ లాంటి భారీ చిత్రం వీలైనంత త్వరగా రావడం ఇండస్ట్రీకి చాలా అవసరం. కాబట్టి ‘లెనిన్’ కోసం ‘పెద్ది’ ఇంకా వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ఇంతకుముందు డెడ్ లైన్ అందుకోలేని పరిస్థితుల్లో ఊరికే ‘పెద్ది’ పేరు చెప్పి ‘లెనిన్’ను వాయిదా వేసింది టీం. కానీ ఇప్పుడు ‘పెద్ది’తో తలపడలేక డేట్ మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈసారి డేట్ మార్చుకునే సమయంలో కారణం ఏం చెబుతారన్నది ఆసక్తికరం. మొత్తానికి రిలీజ్ డేట్ వ్యవహారం ‘లెనిన్’కు పెద్ద తలనొప్పిగా మారింది పాపం.