Begin typing your search above and press return to search.

బన్నీ, తారక్ సరసన చరణ్? పెద్దితో కొత్త ఛాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

By:  M Prashanth   |   26 May 2026 12:00 AM IST
బన్నీ, తారక్ సరసన చరణ్? పెద్దితో కొత్త ఛాన్స్..
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ సినిమాతో చరణ్ మరోసారి పాన్ ఇండియా మార్కెట్‌ ను టార్గెట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌ కు నార్త్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా హిందీ వెర్షన్ భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో చరణ్‌ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు అదే ఇమేజ్‌ ను మరింత స్ట్రాంగ్ గా మార్చాలని పెద్ది టీమ్ భావిస్తోంది. అందుకే ప్రమోషన్స్‌ ను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసింది. ఇటీవల ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. భోపాల్‌ లో గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌ ను ఏర్పాటు చేశారు.

సాధారణంగా తెలుగు సినిమాల ఈవెంట్లు హైదరాబాద్ లేదా చెన్నై వరకే పరిమితమవుతుంటాయి. కానీ ఇప్పుడు నార్త్ ఆడియన్స్‌ ను టార్గెట్ చేస్తూ ప్రమోషన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం హిందీ వెర్షన్‌ లో రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన సౌత్ హీరోల జాబితాలో ప్రభాస్ టాప్‌ లో ఉన్నారు. ఆయన నటించిన బాహుబలి, బాహుబలి 2, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలు అద్భుతమైన వసూళ్లు సాధించాయి. దీంతో హిందీ మార్కెట్‌ లో ప్రభాస్‌ కు ప్రత్యేక స్థానం ఏర్పడింది.

ఆ తర్వాత అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ చెరో రెండు సినిమాలతో ఆ జాబితాలో నిలిచారు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో అల్లు అర్జున్ బాలీవుడ్‌ లో సెన్సేషన్ సృష్టించగా.. ఆర్ఆర్ఆర్ తో పాటు మరో చిత్రంతో ఎన్టీఆర్ కూడా ఆ రికార్డు అందుకున్నారు. వీరి తర్వాత రజనీకాంత్, యశ్, రిషబ్ శెట్టి, ధనుష్ ఒక్కో సినిమాతో ఉన్నారు. ఇక రామ్ చరణ్ ఒక్క మూవీతోనే లిస్టులో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ విజయంతో చరణ్‌ కు ఆ గుర్తింపు దక్కింది.

అయితే ఇప్పుడు పెద్దిపై భారీ అంచనాలు ఉండటంతో.. ఈ సినిమా కూడా హిందీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమాను ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో రూపొందించినట్లు సమాచారం. ఇటీవల సౌత్ సినిమాలకు నార్త్ లో ఆదరణ భారీగా పెరిగింది. అనేక సినిమాలు హిందీ మార్కెట్‌ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి.

అందులో భాగంగానే పెద్ది మూవీ టీమ్ నార్త్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమాపై మంచి బజ్ కనిపిస్తోంది. ట్రైలర్, పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. హిందీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ప్రమోషన్స్‌ ను ప్లాన్ చేయడం ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి జూన్ 4 తర్వాత చరణ్ ఖాతాలో మరో రూ.100 కోట్ల హిందీ గ్రాస్ మూవీ చేరుతుందా? అల్లు అర్జున్, ఎన్టీఆర్ సరసన రెండు సెంచరీ సినిమాలు ఉన్న హీరోగా నిలుస్తారా? అన్నది వేచి చూడాలి.