Begin typing your search above and press return to search.

'పెద్ది' సౌండ్ కోసం ఇంకాస్త గట్టిగా..

వీటన్నింటినీ ఏఆర్ రెహమాన్ స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ టూర్‌లతో బిజీగా ఉండటంతో, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని దర్శకుడు బుచ్చిబాబుకు స్పష్టం చేశారట.

By:  M Prashanth   |   15 Oct 2025 7:54 PM IST
పెద్ది సౌండ్ కోసం ఇంకాస్త గట్టిగా..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. RC16గా మొదలైన ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే గ్లింప్స్ తో సిక్సర్ కొట్టిన చిత్ర యూనిట్ ఇక రెగ్యులర్ ప్రమోషన్ డోస్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, సినిమా ఆల్బమ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

దసరాకు వస్తుందనుకున్న ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ దీపావళికి కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే, ఈ ఆలస్యం వెనుక అసలు కారణం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది కేవలం వాయిదా కాదు, అంతకుమించిన ఒక మాస్టర్ ప్లాన్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విషయం ఏంటంటే, 'పెద్ది' మొదటి పాట ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. పాట చిత్రీకరణ పూర్తయ్యాక, దానికి సంబంధించిన రీ రికార్డింగ్, మిక్సింగ్ వంటి ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయి.

వీటన్నింటినీ ఏఆర్ రెహమాన్ స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ టూర్‌లతో బిజీగా ఉండటంతో, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని దర్శకుడు బుచ్చిబాబుకు స్పష్టం చేశారట. హడావుడిగా, సగం క్వాలిటీతో పాటను విడుదల చేయడం కరెక్ట్ కాదని, కాస్త సమయం తీసుకున్నా పర్ఫెక్ట్ అవుట్‌పుట్‌తో రావాలని చిత్రయూనిట్ బలంగా నిర్ణయించుకుంది. బుచ్చిబాబు కూడా క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గకూడదనే పట్టుదలతో ఉన్నాడు.

ఇక ఈ గ్యాప్‌ను ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకోవాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. నవంబర్ 8న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్ రెహమాన్ భారీ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. వేలాది మంది సంగీత ప్రియులు, మెగా అభిమానుల సమక్షంలో ఆ వేదికపై 'పెద్ది' మొదటి పాటను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సింపుల్‌గా రిలీజ్ చేయడం కంటే, ఇలాంటి మెగా ఈవెంట్‌లో పాటను విడుదల చేస్తే వచ్చే బజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని వారి ఆలోచన. ఈలోపు పాట వీడియోకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు.

ఇక సినిమా విషయానికొస్తే, ఈ పాట ఆలస్యం సినిమా విడుదలపై ఏమాత్రం ప్రభావం చూపదని టీమ్ స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించినట్లే, 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం ఖాయం. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.