నార్త్ లో 'పెద్ది'.. భయపడాల్సిన అవసరమే లేదా?
ముఖ్యంగా చరణ్ ను పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మాస్, ఎమోషన్, డ్రామా కలిపిన ప్యాకేజ్ గా సినిమా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి.
By: M Prashanth | 6 May 2026 11:48 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే ఆ సినిమా అన్ని విషయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పెద్దిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఉప్పెనతో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సాన పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ ఎమోషనల్ కథతో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ముఖ్యంగా చరణ్ ను పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మాస్, ఎమోషన్, డ్రామా కలిపిన ప్యాకేజ్ గా సినిమా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇక సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఇది మరో స్ట్రెయిట్ తెలుగు చిత్రం కావడంతో నార్త్ ఆడియన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది. దీంతో సినిమా సౌత్ తో పాటు నార్త్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలకు హిందీ బెల్ట్ కలెక్షన్స్ కీలకం.
అక్కడ మంచి ఓపెనింగ్స్ రాకపోతే మొత్తం బిజినెస్ పై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో పెద్దికి ఒక్క సవాల్ ఎదురవుతుందనే చర్చ జరుగుతోంది. అదేంటంటే.. జూన్ 5న బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన మరో చిత్రం విడుదల కావడం. దీంతో థియేటర్స్ షేరింగ్ విషయంలో పోటీ ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ ఆ పోటీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సినీ ప్రియులు చెబుతున్నారు.
పెద్దికి పాజిటివ్ టాక్ వస్తే, హిందీ మార్కెట్ లో కూడా దాన్ని అడ్డుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ కు ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఏర్పడింది. గత చిత్రాల ద్వారా హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా ముఖ్యంగా పెద్ది మూవీని హిందీ మార్కెట్ లో ప్రముఖ సంస్థ జియో స్టూడియోస్ భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
థియేటర్స్ విషయంలో ముందుగా ప్లానింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో స్క్రీన్ కౌంట్ పరంగా పెద్దికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, పెద్దికి నార్త్ లో పోటీ ఉన్నప్పటికీ అది పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే, పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్లు సునామీ సృష్టించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4పై పడింది. మరి పెద్ది పాన్ ఇండియా రేంజ్ ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.
