రామ్‌చరణ్‌కి 'పెద్ది' నేర్పిన పాఠాలు
దీనితో పాటు హిందీ బెల్ట్ (నార్త్ ఇండియా) మార్కెట్ కూడా పెద్ద స్టార్లకు ఎంతో కీలకం. `పెద్ది` చిత్రం ఉత్తరాదిన చాలా సోసోగానే ఆడింది.
By: Sivaji Kontham | 10 July 2026 12:00 AM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ మాస్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది` థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు వచ్చింది. జూలై 9 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ లో ప్రీమియర్‌గా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫైనల్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 334 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో భారతదేశం నుండి రూ. 282 కోట్లు వసూలు చేయగా.. ఓవర్సీస్ (విదేశాల) నుండి కేవలం రూ. 52 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంపర్ హిట్ అనిపించుకున్న ఈ చిత్రం.. విదేశీ మార్కెట్‌లో.. హిందీ బెల్ట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ఈ రోజుల్లో ప్రేక్షకుల ఆలోచనా విధానం.. సినిమా చూసే శైలి పూర్తిగా మారిపోవడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఓటీటీ - డిజిటల్ మాధ్యమాల విప్లవం పుణ్యమా అని సామాన్య ఆడియన్స్ సైతం విభిన్నమైన అంతర్జాతీయ కంటెంట్‌ను చూడటానికి అలవాటు పడ్డారు. తెలుగు ప్రేక్షకులు కూడా హాలీవుడ్ ఫ్రాంచైజీ సినిమాలను ఎంతోగానో ఆస్వాధిస్తున్నారు. వందల, వేల కోట్ల బడ్జెట్‌లతో రూపొందే విదేశీ చిత్రాలను చూస్తున్నప్పుడు.. మన తెలుగు హీరోల సినిమాల్లోనూ అదే రేంజ్ క్వాలిటీ విజువల్స్, వైవిధ్యమైన కథలు, కథనంలో సరికొత్త ప్రయోగాలను ఆశిస్తున్నారు. వీటన్నింటినీ మించి ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కంటే కూడా గ్లోబల్ లేదా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశాలనే నేటి తరం కోరుకుంటోంది.
`పెద్ది` ఫలితాన్ని గమనిస్తే రామ్ చరణ్‌కు ఒక కీలకమైన పాఠం నేర్పినట్లయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఒక సినిమా భారీగా రాణించాలంటే కచ్చితంగా యూనివర్సల్ కంటెంట్‌ను ఎంపిక చేసుకోవాలని మరోసారి ప్రూవైంది. కేవలం లోకల్ కంటెంట్ లేదా పాతకాలపు మాస్ ఫార్ములాలు అంతర్జాతీయ వేదికపై పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేవు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ లాంటి చిత్రాలు విదేశాల నుంచి వందల కోట్లు కొల్లగొట్టాయి. అలాగే ఇటీవలి కాలంలో వచ్చిన `దురంధర్` చిత్రం కూడా విదేశీ మార్కెట్‌లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. వాటితో పోలిస్తే చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమాకు ఓవర్సీస్ నుంచి కేవలం రూ. 52 కోట్ల వసూళ్లు రావడం బాక్సాఫీస్ పరంగా వైఫల్యమనే చెప్పాలి.
దీనితో పాటు హిందీ బెల్ట్ (నార్త్ ఇండియా) మార్కెట్ కూడా పెద్ద స్టార్లకు ఎంతో కీలకం. `పెద్ది` చిత్రం ఉత్తరాదిన చాలా సోసోగానే ఆడింది. ఇక్కడ కేవలం 18 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసిందని బాక్సాఫీస్ ఇండియా పేర్కొంది. నిజానికి ట్రేడ్ లో నిరూపించాలంటే హిందీ బెల్ట్ నుంచి భారీగా వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రభాస్ నటించిన `సాహో` చిత్రానికి క్రిటికల్ గా మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఊహించని రేంజ్‌లో గ్రాండ్ సక్సెస్ సాధించి భారీ వసూళ్లను తెచ్చిపెట్టింది. సాహో తెలుగులో 177 కోట్లు వసూలు చేయగా, హిందీ బెల్ట్ నుంచి 166 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంచుమించు తెలుగు రాష్ట్రాలతో సమానమైన వసూళ్లను అందించింది. పాన్ ఇండియా రేసులో నిలబడాలంటే ఉత్తరాదిన అలాంటి ఊపు- పట్టు రామ్ చరణ్‌కు కూడా మునుముందు రావడం అత్యంత అవసరం.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ రేసులో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్లు గ్లోబల్ రేంజ్ సబ్జెక్టులతో దూసుకుపోతున్నారు. వారితో పోటీపడుతూ రేసులో నిలదొక్కుకోవాలంటే చరణ్ ఇకపై తన కథల ఎంపికను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. కేవలం ప్రాంతీయ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెర్సటైల్ ఆడియెన్ ని ఆకట్టుకునేందుకు యూనివర్సల్ అప్పీల్, హై-ఎండ్ మేకింగ్ వాల్యూస్ ఉన్న కథలను ఎంచుకుంటేనే రామ్ చరణ్ మళ్లీ తన గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కు తగ్గ సంచలన విజయాలను అందుకోగలరు.
