వసూళ్ల సునామీ.. పెద్దికి థర్డ్ వీకెండ్ కూడా దక్కుతుందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద తన స్పీడ్ కొనసాగిస్తోంది.
By: M Prashanth | 14 Jun 2026 4:54 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద తన స్పీడ్ కొనసాగిస్తోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా తొలి నాలుగు రోజుల్లో భారీ వసూళ్లతో దుమ్మురేపింది. ఆ తర్వాత వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో కలెక్షన్ల వేగం కొంత తగ్గినా.. వీకెండ్ రాగానే మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు శనివారం సాధించిన వసూళ్లు హాట్ టాపిక్ గా మారాయి.
నిన్నటితో పెద్ది సినిమా 10 రోజుల బాక్సాఫీస్ జర్నీని కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా రూ.378 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. విడుదలైన పదో రోజుకే ఆ రేంజ్ లో వసూళ్లు నమోదు చేయడం విశేషంగా మారింది. ఇక ఆదివారం సెలవు రోజు కావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ఈరోజు లేదా రేపటిలోనే పెద్ది రూ.400 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రేక్షకుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి మరో స్ట్రాంగ్ ప్రూఫ్ గా నిలిచింది ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్. శనివారం నాడు ఒక్క బుక్ మై షోలోనే లక్షకుపైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాపై ఉన్న ఆసక్తిని ఆ నెంబర్ క్లియర్ గా చూపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్ థియేటర్లకు వస్తుండటం కలెక్షన్లు పెరుగుతున్నాయి.
అయితే పెద్దికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలు కానుంది. ఎందుకంటే రేపటి నుంచి మళ్లీ పీక్ వర్కింగ్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో వీక్ డేస్ లో ప్రేక్షకుల రాక ఎప్పుడూ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోతే దాని ప్రభావం నేరుగా బాక్సాఫీస్ వసూళ్లపై పడటం ఖాయమని తెలుస్తోంది.
మరోవైపు వచ్చే వారం నుంచి కొత్త సినిమాల పోటీ కూడా ప్రారంభం కానుంది. మా ఇంటి బంగారం, దీవానా సహా పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా మూవీ టీమ్స్ ఫుల్ ప్రమోషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పెద్దికి స్క్రీన్ల పరంగా కూడా కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది.
అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ వీకెండ్ ను పూర్తిగా యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రామ్ చరణ్ టీమ్ కు కనిపిస్తోంది. ఒకవేళ కొత్తగా విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను అనుకున్న రేంజ్ లో కూడా మెప్పించలేకపోతే మాత్రం పెద్దికి మరో వీకెండ్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే ఆ సినిమా వసూళ్ల సునామీ మరికొన్ని రోజులు కొనసాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఆ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న పెద్ది.. మూడో వీకెండ్ ఛాన్స్ కూడా అందుకుంటుందా? లేక కొత్త రిలీజుల ఎఫెక్ట్ కు బ్రేక్ పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
