Begin typing your search above and press return to search.

చరణ్ పెద్ది.. అసలు లెక్క తేలనుందా?

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

By:  M Prashanth   |   4 April 2026 10:34 AM IST
చరణ్ పెద్ది.. అసలు లెక్క తేలనుందా?
X

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. షూటింగ్ పెండింగ్ ఉందనే కారణంతో ఏప్రిల్ 30న ఈ చిత్రం రావడం లేదని, సమ్మర్ రేసు నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. ఒక భారీ సినిమా డేట్ మారుతుందంటే ఆ గ్యాప్‌ను దక్కించుకోవడానికి ఇతర చిన్న, మీడియం రేంజ్ సినిమాలు పోటీ పడటం సహజం.

అందుకే నిఖిల్ ‘స్వయంభూ’, సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు ఆ తేదీపై కన్నేశాయని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో టాక్ వైరల్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు సంబంధించి అప్పుడే సందడి మొదలైందని టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 30న సినిమా విడుదల చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కు ఓ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు తన స్టైల్‌లో క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే, అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేసే పనిలో పడ్డారు.

ఏప్రిల్ 8వ తేదీన ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. అదే రోజున ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు పూర్తిస్థాయిలో తెరపడినట్లే. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంటే రిలీజ్ డేట్ ఖాయమైనట్లే కాబట్టి, అభిమానులు ఈ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఒక పెద్ద సినిమా సమ్మర్ రేసులో ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. రామ్ చరణ్ కెరీర్‌లో ‘పెద్ది’ చాలా ప్రత్యేకమైన చిత్రం కావడంతో, దీనిపై భారీ పెట్టుబడులు పెట్టారు. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్‌ను వదులుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. అందుకే ఏప్రిల్ నెలాఖరున బాక్సాఫీస్ వద్ద పహిల్వాన్‌లా దిగడానికి చరణ్ సిద్ధమవుతున్నారు. ఒకవేళ చిన్నపాటి షూటింగ్ పెండింగ్ ఉన్నా, దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని టీమ్ భావిస్తోంది.

ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే, ‘పెద్ది’ వాయిదా పడటం లేదని తేలితే వారు తమ పాత ప్లాన్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 అనేది సమ్మర్ సీజన్‌లో ఒక బెస్ట్ డేట్. అందుకే ఈ డేట్ కోసం గట్టి పోటీ నెలకొంది. అయితే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో బరిలో ఉన్నప్పుడు, సోలో రిలీజ్ దొరికితేనే వసూళ్లు భారీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 8వ తేదీన బుకింగ్స్ విషయంలో వచ్చే క్లారిటీతో మిగతా సినిమాల భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. ఏదేమైనా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే వాయిదా పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుంది. మరి ఏం జరుగుతోంది చూడాలి.