Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. ఇప్పుడు ఫ్యాన్స్ భయం అదేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది విడుదలపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.

By:  M Prashanth   |   6 April 2026 1:12 PM IST
చరణ్ పెద్ది.. ఇప్పుడు ఫ్యాన్స్ భయం అదేనా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది విడుదలపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే వార్తలకు రామ్ చరణ్ రీసెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టారు. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం, ఏప్రిల్ 30న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రాకాస సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

అయితే సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందా లేదా అనే సందేహాలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. ఇంకా దాదాపు 20 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, ఒక ఐటెం సాంగ్ కూడా చిత్రీకరించాల్సి ఉందని ప్రచారం జరిగింది. దీనికి తోడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ లో రిలీజ్ డేట్ ప్రస్తావించకపోవడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

దీంతో పెద్ది విడుదల వాయిదా ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. అయితే మేకర్స్ ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉందని, ప్యాచ్ వర్క్ శరవేగంగా సాగుతుందని చెబుతున్నారు. మిగిలిన భాగాన్ని వారం రోజుల్లో పూర్తి చేయడంతో పాటు ఐటెం సాంగ్ చిత్రీకరణ త్వరగా ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేసి, సమయానికి సినిమా విడుదల చేయాలన్నది టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అలా సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చినప్పటికీ, ఇప్పుడు కొత్తగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పనితీరుపై చర్చ మొదలైంది. పెద్ది చిత్రానికి ఆయన సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనను దక్కించుకున్నాయి. అయితే పూర్తి స్థాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు ఇంకా పూర్తి కాలేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అంతే కాదు.. ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని కీలక సన్నివేశాలకు కూడా ఇంకా బీజీఎం కంపోజ్ చేయాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో నిర్ణయించిన సమయానికి రెహమాన్ తన పనిని పూర్తి చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఆయన ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం జరిగిన సందర్భాలు ఉండటంతో, అభిమానుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది.

ఒకవేళ మ్యూజిక్ పనులు సమయానికి పూర్తికాకపోతే, సినిమా విడుదలపై మళ్లీ ప్రభావం పడే అవకాశం ఉంది. అవసరమైతే విడుదలను వాయిదా వేయాల్సి రావొచ్చని అంటున్నారు. మరోవైపు, టీమ్ అంతా వేగంగా పని చేస్తున్నందున ఎలాంటి సమస్యలు లేకుండా సినిమా సమయానికి థియేటర్లలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే పెద్ది విడుదలపై కొంత క్లారిటీ వచ్చినప్పటికీ, మ్యూజిక్ వర్క్ పై ఫ్యాన్స్ లో నెలకొన్న భయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.