'ఉప్పెన' కంటే 14 రెట్లు అధిక బడ్జెట్: 'పెద్ది'కి 350 కోట్లు.. బుచ్చిబాబు లీక్స్!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' బడ్జెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
By: Sivaji Kontham | 2 Jun 2026 11:30 AM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందిన పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' బడ్జెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. విజయవాడలో జరిగిన పెద్ది ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. తన మొదటి చిత్రం 'ఉప్పెన'ను కేవలం 25 కోట్లతో రూపొందించగా.. ఈ 'పెద్ది' చిత్రం కోసం నిర్మాతలు ఏకంగా 350 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారని వెల్లడించారు.'ఉప్పెన'తో పోలిస్తే ఇది 14 రెట్లు అధిక బడ్జెట్ కావడం విశేషం. ఇంతటి భారీ బడ్జెట్ ను దర్శకహీరోలను నమ్మి పెట్టిన నిర్మాతలకు బుచ్చిబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణంగా 350 కోట్ల బడ్జెట్ అంటే టాలీవుడ్ లోనే అత్యంత భారీ వ్యయంతో కూడుకున్నది. గతంలో సంచలనం సృష్టించిన బాహుబలి 2, కేజీఎఫ్ 2, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల నిర్మాణానికి కూడా ఈ స్థాయి బడ్జెట్ అవ్వలేదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన బాహుబలి2, కేజీఎఫ్ 2 చిత్రాల స్థాయిని మించిన భారీ విజయాన్ని - రికార్డు వసూళ్లను 'పెద్ది' అందుకోవాల్సి ఉంటుంది.
పెద్ది విజయవాడ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ..'ఉప్పెన' వచ్చి ఐదేళ్లు పూర్తయిందని..ఆ చిత్రానికి జాతీయ అవార్డుతో పాటు నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయని గుర్తుచేశారు. ఇంత సమయం ఎందుకు తీసుకున్నావని అడిగిన వారికి 'పెద్ది' కోసమేనని సమాధానమిచ్చారు. ఉప్పెన కథను కూడా విజయవాడలోనే రాసుకున్నట్లు చెప్పిన బుచ్చిబాబు మెగాస్టార్ చిరంజీవి తనకు ఉప్పెన ఇస్తే.. రామ్ చరణ్ గారు 'పెద్ది' సినిమాను ఇచ్చారని ఎమోషనల్ అయ్యారు. తనను చరణ్ దగ్గరకు పంపిన గురువు సుకుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ... కథ విన్న తర్వాత రామ్ చరణ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా తనపై పూర్తి నమ్మకం ఉంచారని వెల్లడించారు.
సినిమా ఇతివృత్తాన్ని వివరిస్తూ.. 'పెద్ది' ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న బలమైన ఎమోషనల్ డ్రామా అని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఇది ఎగిసిపడే మనిషి కథ కాదు.. కింద పడిపోయి మళ్లీ లేచే ఒక ఆటగాడి ఆత్మగౌరవ పోరాటమని.. అతడి విజయం చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా మార్చిందనేదే ప్రధానాంశమని చెప్పారు. తాను ఇప్పటికే ఈ సినిమాను వందసార్లు చూశానని... చూసిన ప్రతిసారీ కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఉద్వేగానికి లోనయ్యారు. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు చేసిన 'అప్పలసూరి' పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందని.. హీరోయిన్ జాన్వీ కపూర్ నటనలో ఒక ప్రత్యేకమైన హీరోయిజం కనిపిస్తుందని కొనియాడారు.
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ కాగా.. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా స్టైలిష్‌గా, మాసీగా ఉంటుందని దర్శకుడు వివరించారు. రెహమాన్ తో పనిచేయాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరిందన్నారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తను రాసుకున్న ప్రతి అక్షరానికి ప్రాణం పోస్తూ చరణ్ నటనను అద్భుతంగా ఆవిష్కరించారని... నిర్మాత సతీష్ కిలారు ఒక్కరోజు కూడా ఒత్తిడి చేయకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చారని ప్రశంసించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా థియేటర్లలో చూసి ఆదరించాలని బుచ్చిబాబు సానా కోరారు.
