Begin typing your search above and press return to search.

'చికిరి' చేసిన అతి పెద్ద మేలు

కానీ ఈ పేరును అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ డిజాస్టర్లు అయ్యాయి.

By:  Garuda Media   |   11 Nov 2025 7:10 PM IST
చికిరి చేసిన అతి పెద్ద మేలు
X

ఇప్పుడు ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నవాడే. కానీ ఎంతో ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగినా.. ఆ ఇమేజ్ రాదు. దానికి అనుకోకుండా అన్నీ కలిసి రావాలి. అసలు పాన్ ఇండియా అనే పదం గురించి చర్చే లేనపుడు రామ్ చరణ్ బాలీవుడ్లో వెలిగిపోవాలని ‘జంజీర్’ మూవీ చేశాడు. కానీ అది అతడికి చెడ్డ పేరే తెచ్చిపెట్టింది. దీంతో మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. కానీ రాజమౌళితో చేసిన ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయిలో కాదు.. పాన్ వరల్డ్ రేంజిలో పాపులారిటీ సంపాదించాడు. హాలీవుడ్లో కూడా పేరు సంపాదించాడు.

కానీ ఈ పేరును అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ డిజాస్టర్లు అయ్యాయి. ముఖ్యంగా ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ వేసుకుని వచ్చిన ‘గేమ్ చేంజర్’ పెద్ద దెబ్బే కొట్టింది. దీంతో మళ్లీ ‘మెగా పవర్ స్టార్’ ట్యాగ్‌కు వచ్చేశాడు చరణ్. ‘గేమ్ చేంజర్’ అనుభవం నేపథ్యంలో తన కొత్త సినిమా ‘పెద్ది’ పాన్ ఇండియా ప్రేక్షకులకు ఏమేర రీచ్ అవుతుందో అన్న సందేహాలు కూడా కలిగాయి.

కానీ ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్ నార్త్ ఇండియాలో కూడా మంచి అప్లాజే తెచ్చుకుంది. చరణ్ బ్యాటింగ్ మూమెంట్‌ను నార్త్ జనాలు కూడా ఇన్‌స్టా రీల్స్‌లో బాగానే అనుసరించారు. ఐతే దాన్ని మించి ఇప్పుడు ‘చికిరి’ పాట క్రియేట్ చేసిన బజ్ చాలా పెద్దదిగా కనిపిస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కొన్నేళ్ల నుంచి మంచి పాటలు ఇవ్వట్లేదనే విమర్శలున్నాయి. ఆయన పాటలు అంతగా వైరల్ కావడం లేదు.

కానీ ‘చికిరి’ ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ అయిపోయింది. రిలీజైన మూడు రోజులకే 60 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాటలో మంచి బీట్ ఉన్నప్పటికీ.. చరణ్ స్టెప్పులు అదిరిపోయినప్పటికీ.. తెలుగులో కొంచెం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుక్కారణం సింగర్ మోహిత్ చౌహాన్ పదాలను సరిగ్గా పలకపోవడం.. లిరిక్ రైటర్ కొన్ని బూతులను ఆశ్రయించడం, ప్రాస కోసం ప్రయాస పడడం. ఓవరాల్‌గా తెలుగులో పాట హిట్టే అయినా.. ఈ అంశాలు పంటి కింద రాళ్లలా మారాయి.

కానీ ‘చికిరి’ హిందీ పాటకు మాత్రం యునానమస్ అప్లాజ్ వస్తోంది. మోహిత్ హిందీ సింగర్ కావడంతో మంచి ఫ్లోతో ఆ పాట పాడాడు. లిరిక్స్ కూడా బాగానే కుదిరాయి. తెలుగు పాట విని.. హిందీ సాంగ్ వింటే అది చాలా బెటర్‌గా, ఫ్లా లెస్‌గా అనిపిస్తోంది. ఈ పాట హిందీలో పెద్ద హిట్టయ్యేలా, సినిమాకు నార్త్‌లో మంచి బజ్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇలాంటి ఇంకో రెండు పాటలు పడితే.. టీజర్, ట్రైలర్ కూడా బాగుంటే ‘పెద్ది’.. ‘పుష్ప’ తరహాలో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలుంటాయి.