చరణ్ ఉంటే అద్భుతమే.. 'ఇరుముడి 2'పై శివ నిర్వాణ ఏమన్నారంటే..
ఈ ప్రచారం మొదట సోషల్ మీడియాలోనే తన దృష్టికి వచ్చిందని శివ చెప్పారు. మొదట నార్మల్ ఫ్యాన్ ఊహగానే తీసుకున్నానని, తర్వాత అదే మాట ఎక్కువగా తిరగడం మొదలైందన్నారు.
By: M Prashanth | 2 Sept 2026 7:02 PM IST‘ఇరుముడి’లో రామ్ చరణ్ కనిపిస్తాడనే టాక్ రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చరణ్ తరచూ అయ్యప్ప మాల వేయడం, సినిమా నేపథ్యం కూడా అదే కావడంతో ఫ్యాన్స్ ఈ కనెక్షన్ పెట్టుకున్నారు. ముఖ్యంగా మల్లెపూల పల్లకి ఎపిసోడ్‌లో చరణ్ ఉంటాడేమో అనే అంచనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సినిమా హిట్ కావడంతో సీక్వెల్ చేస్తే చరణ్‌ను తీసుకునే అవకాశం ఉందా అనే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ఎదురైంది.
దీనికి శివ నిర్వాణ ఎలాంటి డౌట్స్ క్రియేట్ చేయకుండా ఒక క్లారిటీతో స్పందించారు. చరణ్ తమ సినిమాలో ఉంటే నిజంగా అద్భుతంగా ఉండేదని చెప్పారు. కానీ ‘ఇరుముడి’ తీసేటప్పుడు అలాంటి ఆలోచనే టీమ్‌కు రాలేదన్నారు. సినిమా కథను నమ్ముకుని వెళ్లామని, చరణ్ క్యామియో గురించి ముందుగా ఎలాంటి ప్లాన్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రచారం మొదట సోషల్ మీడియాలోనే తన దృష్టికి వచ్చిందని శివ చెప్పారు. మొదట నార్మల్ ఫ్యాన్ ఊహగానే తీసుకున్నానని, తర్వాత అదే మాట ఎక్కువగా తిరగడం మొదలైందన్నారు. చివరకు తనకు తెలిసిన మీడియా మిత్రులు కూడా “చరణ్ సినిమాలో ఉన్నారా?” అని అడగడంతో విషయం ఇంకో స్థాయికి వెళ్లిందని చెప్పారు. అందుకే అప్పట్లోనే తాను క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
అయితే అలాంటి కాంబినేషన్ జరిగే అవకాశాన్ని మాత్రం ఆయన పూర్తిగా కొట్టిపారేయలేదు. కథలో సహజంగా ఆర్గానిక్ గా అలాంటి పాత్ర వస్తే, చరణ్ లాంటి హీరో ఉండటం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. కానీ ముందుగా స్టార్‌ను అనుకుని కథలో పాత్ర పెట్టడం తన పద్ధతి కాదని క్లారిటీ ఇచ్చారు. కథలో అవసరం వస్తేనే అలాంటి విషయం జరగాలని ఆయన క్లారిటీ ఇచ్చారు.
‘ఇరుముడి’ కథ కూడా అలాగే మొదలైందని శివ వివరించారు. మాలలో ఉన్న ఒక వ్యక్తికి తాగుడు అలవాటు ఉండటం, కూతురు కోసం అయ్యప్ప మాల వేయడం, ఆ 41 రోజుల దీక్షలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు అతన్ని ఎలా మార్చాయి అనే చిన్న పాయింట్ నుంచే కథ మొదలైందన్నారు. అక్కడి నుంచి సినిమా మొత్తం సహజంగా పెరిగిందని చెప్పారు. అందుకే ‘ఇరుముడి’ హిట్ అయిందనే కారణంతో వెంటనే సీక్వెల్ రాయలేనని శివ నిర్వాణ స్పష్టం చేశారు. మొదటి సినిమా పుట్టినట్టే ఇంకో కథ కూడా సహజంగా రావాలని అన్నారు. అలాంటి పాయింట్ దొరికితేనే సీక్వెల్ గురించి ఆలోచిస్తానన్నారు.
