నార్త్ లో చరణ్.. మరీ ఇలాంటి చీప్ ప్రశ్నలు అవసరమా?
పాన్ ఇండియా మూవీల ప్రమోషన్స్ అంటే సాధారణంగా సినిమా విషయాలు, పాత్రల గురించి ఆసక్తికర విషయాలు, దర్శకుడి ఆలోచనలు, మేకింగ్ ఎక్స్పీరియన్స్ లు తెలుసుకోవాలని ఆడియన్స్ ఆశిస్తారు.
By: M Prashanth | 31 May 2026 3:17 PM ISTపాన్ ఇండియా మూవీల ప్రమోషన్స్ అంటే సాధారణంగా సినిమా విషయాలు, పాత్రల గురించి ఆసక్తికర విషయాలు, దర్శకుడి ఆలోచనలు, మేకింగ్ ఎక్స్పీరియన్స్ లు తెలుసుకోవాలని ఆడియన్స్ ఆశిస్తారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ది వంటి సినిమాకు సంబంధించిన ఎన్నో అంశాలు చర్చకు రావాల్సిన సమయంలో, వ్యక్తిగత జీవితానికి చెందిన ప్రశ్నలు అడగడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా రామ్ చరణ్ కు ఎదురైన కొన్ని ప్రశ్నలపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుంది. బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ నార్త్ మార్కెట్ లో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా సినిమా గురించి కాకుండా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా హైలైట్ కావడం గమనార్హం. ప్రమోషన్స్ లో రామ్ చరణ్ ను ఉద్దేశించి, ఉపాసన వివాహ జీవితాన్ని సీఈవోలా క్వార్టర్లీ రివ్యూలతో నడిపిస్తారని చెబుతున్నారంటూ లిమిట్స్ క్రాస్ చేసి ప్రశ్నించారు.
దీనిపై ఎటువంటి కోపం తెచ్చుకోకుండా.. అలా ఏమీ లేదు, ఎక్కడో తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చంటూ రామ్ చరణ్ చాలా కూల్ గా సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత సినిమాలోని శృతి హాసన్ కు సంబంధించిన ఓ పాట వివాదం గురించి ప్రశ్నించగా, ఆ విషయం తనకు తెలియదని రామ్ చరణ్ చెప్పారు. ఆ ప్రశ్న కూడా పెద్ది సినిమాకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు చరణ్ కు అడిగిన ప్రశ్నలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెద్ది మూవీ కథ, చరణ్ పాత్ర, బుచ్చిబాబు విజన్, ఏఆర్ రెహమాన్ సంగీతం, 1980ల బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన సెట్స్, స్పోర్ట్స్ యాక్షన్ సీక్వెన్సులు వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పై ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ నడుస్తోంది.
అయితే ప్రశ్నలు ఎలా ఉన్నా రామ్ చరణ్ మాత్రం సీరియస్ అవ్వకుండా ఎంతో కూల్ గా స్పందించడం అభిమానులను ఆకట్టుకుంది. ఎలాంటి కోపం చూపించకుండా సింపుల్ గా హ్యాండిల్ చేయడం ఆయన మెచ్యూరిటీని మరోసారి చూపించిందని మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అలా అని చెప్పి చీప్ క్వశ్చన్స్ అడుగుతారా.. ఇంకా మార్పు రాదా అంటూ ఫైర్ అవుతున్నారు.
ఏదేమైనా పెద్ది సినిమా ప్రమోషన్స్ లో ఫోకస్ మొత్తం మూవీపై ఉండాల్సిందే గానీ, సంబంధం లేని వ్యక్తిగత విషయాలపై కాదని పలువురు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు తెలుసుకోవాలనుకునే సినిమా విషయాలకు ఇంపార్టెన్స్ ఇస్తే ఇలాంటి ఇంటర్వ్యూలు మరింత ఆసక్తికరంగా మారతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యూచర్ లో మరోసారి అలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఉంటారేమో వేచి చూడాలి.
