Begin typing your search above and press return to search.

చరణ్ కు గురుశిష్యులు మరిచిపోలేని గిఫ్ట్స్ ఇస్తారా?

గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత హీరోలకు వచ్చే అసలు సవాలు.. ఆ ఇమేజ్‌ ను నిలబెట్టుకోవడమే. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు రామ్ చరణ్.

By:  M Prashanth   |   23 May 2026 7:00 AM IST
చరణ్ కు గురుశిష్యులు మరిచిపోలేని గిఫ్ట్స్ ఇస్తారా?
X

గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత హీరోలకు వచ్చే అసలు సవాలు.. ఆ ఇమేజ్‌ ను నిలబెట్టుకోవడమే. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత చేసిన సినిమాలతో సాటిస్ఫై చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు చరణ్ కెరీర్‌ లో రాబోయే రెండు సినిమాలు కీలకంగా మారాయి. ఆ రెండింటికీ దర్శకత్వం వహిస్తున్నది గురుశిష్యులు బుచ్చిబాబు సనా, సుకుమార్ కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఆచార్యలో కీలక పాత్ర పోషించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్ కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో నిలవలేదు. శంకర్ దర్శకత్వం, భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్ ఉన్నా.. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు చరణ్ నుంచి ఒక స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ మూవీ రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఆ ఆశలన్నీ ప్రస్తుతం పెద్దిపైనే ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్నఆ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్సెస్, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ముఖ్యంగా చరణ్ మాస్ లుక్, రగ్గడ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత చరణ్‌ ను కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌ లో చూస్తున్నామనే ఫీలింగ్ ఫ్యాన్స్‌ లో కనిపిస్తోంది.

బుచ్చిబాబు గురించి చెప్పాలంటే.. ఆయన తొలి చిత్రం ఉప్పెనతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. కొత్త కథనం, ఎమోషనల్ ట్రీట్మెంట్‌ తో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా భావోద్వేగాలను తెరపై స్ట్రాంగ్ గా చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉందని చెప్పాలి. అదే ఇప్పుడు పెద్దిలో కూడా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇక పెద్ది తర్వాత చరణ్ చేయబోయే సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటనకు అప్పట్లో భారీ ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమా ఆయన కెరీర్‌ లో టర్నింగ్ పాయింట్‌ గా మారింది. గ్రామీణ నేపథ్యంలో, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయారు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ పై ఇప్పటి నుంచే హైప్ మొదలైంది.

అయితే చరణ్ కెరీర్‌ కు ఆ రెండు సినిమాలు చాలా కీలకం. ఒకవేళ పెద్ది భారీ హిట్ అయితే.. చరణ్‌కు మాస్ ఇమేజ్ మరింత బలపడుతుంది. ఆ వెంటనే సుకుమార్ సినిమా సక్సెస్ అయితే.. ఆయన మార్కెట్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. గ్లోబల్ స్టార్‌ గా వచ్చిన ఇమేజ్‌ కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు అందుకోవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు చరణ్ ఫ్యూచర్ పై గురుశిష్యుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. బుచ్చిబాబు, సుకుమార్ ఇద్దరూ కలిసి చరణ్‌ కు మర్చిపోలేని గిఫ్ట్స్ ఇస్తారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.