Begin typing your search above and press return to search.

APL ప్రారంభోత్సవంలో రామ్‌ చరణ్‌..!

ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవంలో రామ్‌ చరణ్‌ పాల్గొనబోతున్నాడు.

By:  Ramesh Palla   |   1 Oct 2025 1:38 PM IST
APL ప్రారంభోత్సవంలో రామ్‌ చరణ్‌..!
X

రామ్‌ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది సినిమా చరణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందనే విశ్వాసంను ప్రతి ఒక్క మెగా ఫ్యాన్‌ వ్యక్తం చేస్తున్నారు. ఉప్పెన సినిమాతో తన సత్తా చాటిన దర్శకుడు బుచ్చిబాబు రెండో సినిమాతోనే తన గురువు సుకుమార్‌ రికార్డ్‌లను బ్రేక్‌ చేసేందుకు పెద్దిని చాలా పెద్ద ఎత్తున తీస్తున్నాడు. రామ్‌ చరణ్‌ ఈ మధ్య కాలంలో వరుసగా పెద్ది సినిమాకు సంబంధించిన వార్తల్లోనే కనిపిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొనడం ద్వారా మీడియా ముందుకు రాబోతున్నాడు. పెద్ది హెయిర్‌ స్టైల్‌తో పాటు, అదే లుక్‌లో చరణ్‌ గత కొన్నాళ్లుగా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌

ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవంలో రామ్‌ చరణ్‌ పాల్గొనబోతున్నాడు. అక్టోబర్‌ 2న న్యూ ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌లో యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈ భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లుగా నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ లీగ్‌ ప్రారంభోత్సవంకు బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో రామ్‌ చరణ్ పాల్గొనబోతున్నాడు అని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీ పోటీలు నిర్వహించబోతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ అథ్లెట్స్‌ను ఈ కార్యక్రమంలో చూడబోతున్న నేపథ్యంలో ఇదో ప్రత్యేకమైన ఈవెంట్‌గా నిలువబోతుందని క్రీడాకారులు అంటున్నారు. రామ్‌ చరణ్‌ కి ఆటలపై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఈ ఈవెంట్‌లో ఎలా కనిపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రామ్‌ చరణ్ ముఖ్య అథితిగా..

ఇలాంటి ఒక ప్రీమియర్‌ లీగ్‌ ఇండియాలో నిర్వహించడం ఇదే మొదటి సారి. ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ ఉండగా రామ్‌ చరణ్‌ ను నిర్వాహకులు సంప్రదించడం, బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకోవడం ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇండియాకు చెందిన మొత్తం 36 మంది ప్రముఖ రికర్వ్‌, కాంపౌండ్‌ ఆర్చర్లు, 12 మంది ఎలైట్‌ ఇంటర్నెషనల్‌ అథ్లెట్స్‌ ఈ కార్యక్రమంలో పోటీ పడుతారు. గతంలో అంతర్జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొన్న అథ్లెట్స్ కూడా ఉండటంతో ఆటలు చాలా ఆసక్తికరంగా సాగబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఇలాంటి ఆటలకు ఆధరణ లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉండటంతో పాటు, ఇండియన్స్ కు చాలా అనుకూలంగా ఉండే ఈ ఆర్చరీ ని మరింతగా ప్రమోట్‌ చేయడం కోసం రామ్‌ చరణ్‌ తనవంతు కృతి చేస్తున్నారు.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ పెద్ది

ఇక రామ్‌ చరణ్‌ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆరంభంలో శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ చరణ్ ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాను మొదలు పెట్టాడు. పెద్ది సినిమా ఒక స్పోర్ట్స్‌ డ్రామా అనే విషయం తెల్సిందే. అయితే చరణ్‌ పెద్దిలో ఒక్క ఆటకు పరిమితం కాకుండా ఆట కూలీ అన్నట్లుగా కనిపించబోతున్నాడు. చరణ్‌ అన్ని రకాల ఆటలు ఆడుతూ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది. నిజ జీవిత ఘటనలు, వ్యక్తుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందిన కథకు కల్పిత స్క్రీన్‌ ప్లే జోడించి బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి బుచ్చిబాబు ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు చెబుతాడో విడుదల వరకు వెయిట్‌ చేయాల్సిందే.