చరణ్ ఒపీనియన్ ఏంటి? ఎప్పటికీ యూజ్ చేయరా?
సినీ ఇండస్ట్రీలో నట వారసుడిగా కెరీర్ ను ప్రారంభించడం అంత ఈజీ విషయం కాదు. ముఖ్యంగా తండ్రి పెద్ద స్టార్ అయితే, అభిమానుల అంచనాలు మరింత పెరుగుతాయి.
By: M Prashanth | 13 March 2026 5:00 PM ISTసినీ ఇండస్ట్రీలో నట వారసుడిగా కెరీర్ ను ప్రారంభించడం అంత ఈజీ విషయం కాదు. ముఖ్యంగా తండ్రి పెద్ద స్టార్ అయితే, అభిమానుల అంచనాలు మరింత పెరుగుతాయి. మొదటి సినిమా నుంచి ప్రతి స్టెప్ పై కూడా అందరి అబ్జర్వేషన్ ఉంటుంది. చిన్న తప్పు జరిగినా ట్రోల్స్ మొదలవుతాయి. అయితే అలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో ఒకరు రామ్ చరణ్.
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్.. తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగారు. అభిమానులు ఆయనకు మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆ ట్యాగ్ తోనే ఆయన కెరీర్ ముందుకు సాగింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
వరల్డ్ వైడ్ గా ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆయనను గ్లోబల్ స్టార్ అని అంతా పిలవడం ప్రారంభించారు. అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు కూడా అదే ట్యాగ్ ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా చరణ్ ఇమేజ్ మారింది. కానీ గత ఏడాది నుంచి మళ్లీ పరిస్థితి మారిపోయిందని చెప్పాలి.
ప్రస్తుతం చరణ్ నటిస్తున్న పెద్ది మూవీకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ గత ఏడాది రిలీజ్ అవ్వగా.. అందులో హీరోను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గానే పేర్కొన్నారు మేకర్స్. దీంతో గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను పక్కన పెట్టినట్టేనా అనే చర్చ ఇండస్ట్రీలో అప్పుడే మొదలైంది. అది ఒక్క పోస్టర్ తోనే ఆగిపోలేదు. ఆ తర్వాత పెద్ది మూవీ టీమ్ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ లో కూడా మెగా పవర్ స్టార్ ట్యాగ్ మాత్రమే కనిపించింది.
ఆ మార్పు వెనుక అనేక కారణాలు ఉన్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అభిమానుల ఫీడ్ బ్యాక్ ను చరణ్ సీరియస్ గా తీసుకున్నారని టాక్ వచ్చింది. అందుకే పాత ట్యాగ్ ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో గేమ్ ఛేంజర్ మూవీ రిజల్ట్ వల్ల ఆ నిర్ణయానికి ఒక కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ సినిమా దారుణంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే..
దీంతో ఇకపై చరణ్ ముందు పూర్తిగా మెగా పవర్ స్టార్ ట్యాగ్ మాత్రమే కనిపించనుందా అంటూ నెటిజన్లు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వచ్చిన ట్యాగ్ కావడంతో అభిమానులకు కూడా అదే దగ్గరగా అనిపిస్తుందని అంటున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో చరణ్ నటించే సినిమాలు గ్లోబల్ మార్కెట్లలో భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటే, అప్పుడు మళ్లీ గ్లోబల్ స్టార్ ట్యాగ్ వాడొచ్చేమోనని కామెంట్లు పెడుతున్నారు. కానీ అప్పటి వరకు మెగా పవర్ స్టార్ గానే రామ్ చరణ్ కొనసాగుతారా? లేక మళ్లీ కొత్త ట్యాగ్ తో ముందుకు వస్తారా? అనేది వేచి చూడాలి.
