నా సినీ కెరీర్ లైబ్రరీలో నం.1 లేదా నం.2గా ఉంటుంది: రామ్ చరణ్
`గేమ్ ఛేంజర్` లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి ఊరటనిచ్చిన సినిమా `పెద్ది`. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లతో దూసుకెళుతోంది.
By: Sivaji Kontham | 9 Jun 2026 9:45 AM IST`గేమ్ ఛేంజర్` లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత రామ్ చరణ్ కి ఊరటనిచ్చిన సినిమా `పెద్ది`. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా థాంక్స్ మీట్ లో చిత్రబృందం ఎమోషనల్ స్పీచ్ లు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా చిత్ర కథనాయకుడు రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. `పెద్ది` విడుదలయ్యాక ప్రేక్షకులు-అభిమానులు తనపై చూపిస్తున్న అనంతమైన ప్రేమ తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఈ సినిమాను తాను ఎవరి ఒత్తిడి వల్లనో చేయలేదని.. కేవలం దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథలోని నిజాయితీని నమ్మి మాత్రమే చేశానని స్పష్టం చేశారు. దేశవిదేశాల్లో రోజురోజుకూ కలెక్షన్లు- ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటం చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందన్న చెర్రీ ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా రోజుల తర్వాత ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూసినప్పుడు... థియేటర్లో ప్రేక్షకులు ఊహించని సన్నివేశాలకు సైతం చప్పట్లు కొడుతూ స్పందించిన తీరు మరువలేనిదని గుర్తుచేసుకున్నారు.
తన సుదీర్ఘ సినీ కెరీర్ లైబ్రరీలో `పెద్ది` చిత్రం నంబర్ 1 లేదా నంబర్ 2 స్థానాల్లో నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. మొదట కథ విన్నప్పుడు ఎంతో ఉద్వేగంతో దర్శకుడిని హగ్ చేసుకున్నా ఆ తర్వాతే ఇది ఎంతటి రిస్క్‌తో కూడిన `రేజర్ ఎడ్జ్` సబ్జెక్టో అర్థమైందని ఆయన వెల్లడించారు. అయితే సేఫ్ జోన్ కమర్షియల్ ఫార్ములా కాకపోయినా... నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ విజయం నిరూపించిందన్నారు. చిన్న పిల్లల నుండి తాతమ్మలు.. అమ్మమ్మల వరకు అన్ని వర్గాల కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో నటించిన సహ నటీనటులను, పని చేసిన టెక్నీషియన్స్ ప్రతిభను చరణ్ ప్రత్యేకంగా కొనియాడారు. ముఖ్యంగా సీనియర్ నటుడు జగపతిబాబు అద్భుతమైన నటన చూసి తన కళ్లల్లో నీళ్లు వచ్చాయని.. అలాగే శివరాజ్‌కుమార్ నటప్రదర్శన చిత్రానికి పెద్ద బలంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన అసాధారణ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నటీనటుల పెర్ఫార్మెన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. వీటితో పాటు అనంత శ్రీరామ్ అందించిన స్ఫూర్తిదాయకమైన సాహిత్యం జీవితాంతం తన పర్సనల్ ప్లేలిస్ట్‌లో నిలిచిపోతుందని చరణ్ చెప్పుకొచ్చారు.
చివరగా.. ఎక్కడా వెనకాడకుండా ఇంతటి భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకు రామ్ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 185 రోజుల షూటింగ్ లో ఎక్కడా ఒత్తిడి రానివ్వకుండా.. నిరంతరం సెట్స్‌లోనే ఉంటూ సినిమాను విజయవంతంగా పూర్తి చేశారని అభినందించారు. ఒక సినిమాను కోట్లాది మందికి చేరవేయడంలో మీడియా పాత్ర ఎనలేనిదని చెప్తూ... ప్రచారానికి సహకరించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. `పెద్ది` వంటి చిత్రాలకు నిజాయితీ చాలా అవసరమని.. చిత్ర యూనిట్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రేక్షకులు థియేటర్లలో అందిస్తున్నారని తన ఎమోషనల్ స్పీచ్ ని చరణ్ ముగించారు.
