Begin typing your search above and press return to search.

చెన్నై 'పెద్ది' మీట్: మగధీర- రంగస్థలం- RRR తర్వాత ఆ రేంజ్‌లో

ఇదే వేదికపై `పెద్ది` సినిమా విజ‌యంపై తనకున్న అపారమైన నమ్మకాన్ని రామ్ చరణ్ వ్యక్తపరిచారు.

By:  Sivaji Kontham   |   31 May 2026 9:39 AM IST
చెన్నై పెద్ది మీట్: మగధీర- రంగస్థలం- RRR తర్వాత ఆ రేంజ్‌లో
X

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన‌ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `పెద్ది` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ల భాగంలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్ పాల్గొని సినిమా సంగ‌తుల్ని ముచ్చ‌టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై నగరంతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ''నేను చెన్నైకి వచ్చిన ప్రతిసారి నాకు నా సొంత ఊరికి... మా సొంత ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది'' అని చెబుతూ... చెన్నై ఎప్పుడూ తన గుండెకు చాలా దగ్గరైన నగరమని ఎంతో ఆత్మీయంగా పేర్కొన్నారు.

ఇదే వేదికపై `పెద్ది` సినిమా విజ‌యంపై తనకున్న అపారమైన నమ్మకాన్ని రామ్ చరణ్ వ్యక్తపరిచారు. తన కెరీర్‌లో మైల్‌రాళ్లుగా నిలిచిన మగధీర-రంగస్థలం-RRR వంటి భారీ చిత్రాల తర్వాత తాను తన ఫ్యామిలీతో స్నేహితులతో అత్యంత ఎక్కువగా చర్చించిన‌ సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం ఈ `పెద్ది` మాత్రమేనని స్పష్టం చేశారు. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఈ సినిమా కథ- అవుట్‌పుట్ గురించి తమ మధ్య అంతలా డిస్కషన్స్ జరిగాయని చరణ్ వెల్లడించారు.

తన గత బ్లాక్‌బస్టర్ సినిమాల తరహాలోనే ఈ సరికొత్త చిత్రం కూడా ప్రేక్షకులను నూటికి నూరు శాతం అలరిస్తుందనే గట్టి నమ్మకం తనకు ఉందని మెగా హీరో ధీమా వ్యక్తం చేశారు. థియేటర్లలో ఈ సినిమా ఒక పెద్ద హిట్‌గా నిలుస్తుందని చెప్పడానికి త‌మ మ‌ధ్య సుదీర్ఘ సంభాష‌ణ‌లే ఒక పెద్ద కారణమని.. ఈ ఒక్క కారణం చాలు అని తాను బలంగా నమ్ముతున్నట్లు చరణ్ వివరించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానులు చూసి ఆదరించాలని కోరుతూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఉప్పెన త‌ర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇప్పుడు చెన్నై లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంపై చరణ్ చేసిన వ్యాఖ్యలు అంచనాలను మరింత పెంచేశాయి. మగధీర, రంగస్థలం, RRR వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల సరసన చరణ్ `పెద్ది` చిత్రాన్ని చేర్చడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందోనని యావత్ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ న‌టించిన మ‌గ‌ధీర‌, రంగ‌స్థ‌లం, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలు చెన్నై స‌హా త‌మిళ‌నాడులోను అద్భుత వ‌సూళ్ల‌ను సాధించాయి. ఇప్పుడు అదే తీరుగా పెద్ది కూడా త‌మిళ‌నాడు వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని రామ్ చ‌రణ్ అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ దీనికి బిగ్ బూస్ట్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.