ట్రెండీ టాక్: చరణ్‌కి ఆరోజు- ఈరోజు ఎప్పుడూ చిరు వెనకేనా?!
ఇది 2026 దృశ్యం.. అది 2004 దృశ్యం.. పెద్దికి-చిరుతకు మధ్య ఉన్న దూరం ఇది. ఆ రెండిటి మధ్యలో 2004లో మరో దృశ్యం ఉంది.
By: Sivaji Kontham | 25 Jun 2026 11:57 AM ISTఇది 2026 దృశ్యం.. అది 2004 దృశ్యం.. పెద్దికి-చిరుతకు మధ్య ఉన్న దూరం ఇది. ఆ రెండిటి మధ్యలో 2004లో మరో దృశ్యం ఉంది. అది చరణ్ డెబ్యూ స్పీచ్ ఇచ్చిన దృశ్యం. నాటి దృశ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏం మాట్లాడారో, నేటి పెద్ది సక్సెస్ దృశ్యంలో మెగాస్టార్ ఏం మాట్లాడారో రెండిటికీ ముడి వేస్తూ, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ అరుదైన ప్రత్యేక దృశ్యం, ఇంటర్నెట్ లో రికార్డులు బ్రేక్ చేస్తోంది.
దాదాపు 22 సంవత్సరాల క్రితం చరణ్ తన డెబ్యూ స్పీచ్ ఇచ్చాడు. 19 ఏళ్ల క్రితం అతడు డెబ్యూ హీరోగా చిరుత చిత్రంతో లాంచ్ అయ్యాడు. ఇప్పుడు `పెద్ది` వరకూ ప్రయాణం సాగింది. ఈ ప్రయాణంలో అతడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఇప్పుడు `న్యూఏజ్ మెగాస్టార్` గా అవతరించాడు. ఈ ఆనందాన్ని మెగాస్టార్ చిరంజీవి పబ్లిక్ వేదికలపై సెలబ్రేట్ చేసుకుంటున్న తీరు అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది.
ఆరోజు మెగా మాస్ ఫ్యాన్స్ సమక్షంలో బర్త్ డే ఉత్సవాలు జరుపుకున్న మెగాస్టార్ ఏం మాట్లాడారో.. ఇప్పుడు పెద్ది ఉత్సవంలో మెగాస్టార్ ఏం మాట్లాడారో పోలికలు ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.. ఆరోజు చిరు ఇలా మాట్లాడారు. ఇదే చరణ్ మొదటిసారి స్పీచ్.. ఏం మాట్లాడతాడోనని నాక్కూడా టెన్షన్ గా ఉందని చిరు అన్నారు. ఆ తర్వాత చరణ్ టెన్షన్ చూసి.. ``చూసారా మనం వెనక లేకపోతే భయపడుతున్నాడు. కాబట్టి మనం ఉండాలి.. మీరూ వెంట ఉండాలి..`` అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. చరణ్ మొదటి సినిమా ఫ్యాన్స్ మీట్ ఈవెంట్లో చిరు మాటలు, ఈరోజు చరణ్ ని ముందుకు పుష్ చేస్తూ మాట్లాడిన విషయాలు.. తండ్రిగా తన ప్రేమను ఆవిష్కరించాయి.
అప్పట్లోనే ఆగస్టు 2004లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకున్నారు అభిమానులు .. ఆ సమయంలో చరణ్ తన తొలి స్పీచ్‌తో ఆరంగేట్రం చేసాడు. ఆ సమయంలో నేను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు.. మీలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నాన్నగారికి బర్త్ డే విషెస్ చెబుతున్నాను.. అంటూ చిరు పాదాలపైకి వంగి ఆశీస్సులు అందుకున్నాడు. అదే చరణ్ మొదటి స్పీచ్.. ఈ వేడుకలో పవన్ కల్యాణ్, శ్రీకాంత్, రాజా రవీంద్ర తదితరుల మెగాభిమానులు వేదికపైనే ఉన్నారు. చిరుత మూవీ 2007లో రిలీజైంది గనుక అంతకు మూడేళ్ల ముందే చరణ్ తన తొలి డెబ్యూ స్పీచ్ ని ఇచ్చాడు.
చరణ్ ను ముందు ఉంచి నేను వెనక ఉండటం అనేది సబబు! అంటూ ఇప్పుడు మరోసారి మెగాస్టార్ ఎప్పటికీ తనయుడి వెంటే ఉంటానని పెద్ది వేదికపై భరోసాని ఇవ్వడం ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తోంది. రెండు దశాబ్ధాల క్రితం చిరుత విడుదలకు ముందు చరణ్ ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అదే వినమ్రతతో డాడీ కిడ్ లాగే ఉన్నారు. అతడిలో ఎక్కడా కించిత్ గర్వం కనిపించడం లేదు. ఒదిగి ఉండే స్వభావం అతడిని మరింత పరిణతి చెందిన వాడిగా, పరిపూర్ణుడిగా ఆవిష్కరిస్తోంది.
గర్వం గురించి.. ఒదిగి ఉండటం గురించి.. కష్టపడి పని చేయడం గురించి పెద్ది వేదికపై మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాల్లాంటి మాటలను నేడు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు స్ఫూర్తిగా తీసుకుంటున్నారంటే.. మెగా హీరోల పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
