Begin typing your search above and press return to search.

బాడీగార్డ్ ని సెల్ఫీలతో ఇబ్బంది పెడుతున్న మెగా ఫ్యాన్స్

సాధారణంగా స్టార్ హీరోలతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. స్టార్ హీరో రామ్ చరణ్ వెంట కనిపించే బాడీగార్డ్ కెవిన్ కుంట.. ఎక్కడ కనిపించినా ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు.

By:  M Prashanth   |   5 Jun 2026 8:55 PM IST
బాడీగార్డ్ ని సెల్ఫీలతో ఇబ్బంది పెడుతున్న మెగా ఫ్యాన్స్
X

సాధారణంగా స్టార్ హీరోలతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. స్టార్ హీరో రామ్ చరణ్ వెంట కనిపించే బాడీగార్డ్ కెవిన్ కుంట.. ఎక్కడ కనిపించినా ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పెద్ది సినిమా ప్రమోషన్ల సమయంలో రామ్ చరణ్ వెంట ఎప్పుడూ కనిపించిన కెవిన్ కుంట ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణ సెక్యూరిటీ సిబ్బందిలా కాకుండా.. భారీ బాడీ, ఫిట్‌ నెస్, ప్రొఫెషనల్ లుక్‌ తో కనిపించిన ఆయన గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో సోషల్ మీడియాలో కెవిన్ గురించి కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ కుంట.. ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్‌ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్‌ గా గుర్తింపు పొందారు. నేషనల్ మిడిల్‌ వెయిట్ ఛాంపియన్‌ గా కూడా రాణించిన ఆయనకు క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీలో స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సెలబ్రిటీలు, వీవీఐపీల సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించడంలో స్కిల్స్ కలిగిన వ్యక్తిగా పేరుంది.

మొదట్లో చాలామంది కెవిన్‌ ను రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా నియమించుకున్న బాడీగార్డ్‌ గా భావించారు. అయితే పెద్ది ప్రమోషన్ల సమయంలో ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. కెవిన్ కేవలం చరణ్‌ కే కాకుండా, ఆయన కుటుంబానికి కూడా గత కొన్నేళ్లుగా సెక్యూరిటీగా సేవలు అందిస్తున్నట్లు తెలిసింది. దీంతో మెగా కుటుంబానికి ఆయన ఎంత కీలకమైన వ్యక్తో అభిమానులకు అర్థమైంది.

ఇటీవల ముంబైలో జరిగిన పెద్ది ప్రమోషనల్ ఈవెంట్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సమయంలో రామ్ చరణ్‌ ను దగ్గరగా చూడాలని అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో ఏర్పడిన పరిస్థితిని కెవిన్ ఎంతో తెలివితో కంట్రోల్ చేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా అభిమానులను వెనక్కి పంపిన విధానం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంది.

మరో కార్యక్రమంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చరణ్ దగ్గరకు ఒక్కసారిగా వచ్చిన ఓ అభిమాని సెక్యూరిటీ సర్కిల్ ను దాటేందుకు ప్రయత్నించగా, కెవిన్ అతడిని చాలా వేగంగా అడ్డుకుని పక్కకు తీసుకెళ్లాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి కెవిన్ పేరు ట్రెండింగ్‌ లోకి వచ్చింది. అయితే ఇప్పుడు చరణ్‌ తో పాటు కెవిన్ కనిపించినా అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కెవిన్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.

కొందరు ప్రత్యేకంగా కెవిన్‌ తో ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఒక బాడీగార్డ్‌ కు కూడా సెలబ్రిటీ రేంజ్ గుర్తింపు రావడం ఆసక్తికరంగా మారింది. అయితే కెవిన్ కు రోజుకు లక్షల రూపాయల పారితోషికం అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా ఆయనకు మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు. ఏదేమైనా పెద్ది ప్రమోషన్లతో రామ్ చరణ్ ఎంతగా వార్తల్లో నిలిచారో, ఆయన బాడీగార్డ్ కెవిన్ కుంట కూడా అంతే స్థాయిలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం మెగా అభిమానుల సెల్ఫీ రిక్వెస్టులతో కెవిన్‌ కు కూడా ఊహించని స్టార్‌ డమ్ దక్కినట్లే కనిపిస్తోంది.