Begin typing your search above and press return to search.

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

రాజమౌళి 'RRR' కోసం దాదాపు రూ.550 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ కావడంతో ఆ బడ్జెట్‌ను చరణ్ ఒక్కరి మార్కెట్‌తో పోల్చలేం.

By:  M Prashanth   |   5 Nov 2026 11:43 AM IST
రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!
X

రామ్ చరణ్ సినిమాలకు ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ కామన్ అయిపోయింది. 'RRR' తర్వాత ఆయన చేస్తున్న ఒక్కో సినిమాకు దర్శకుడు మారుతున్నా, ఖర్చు విషయంలో మాత్రం నిర్మాతలు భారీగానే వెళ్తున్నారు. శంకర్‌తో 'గేమ్ ఛేంజర్', బుచ్చిబాబుతో 'పెద్ది' తర్వాత ఇప్పుడు సుకుమార్‌తో RC17 మొదలైంది. ఈ సినిమాకు కూడా హై రేంజ్ లోనే ఖర్చు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి 'RRR' కోసం దాదాపు రూ.550 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ కావడంతో ఆ బడ్జెట్‌ను చరణ్ ఒక్కరి మార్కెట్‌తో పోల్చలేం. కానీ ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించాక చరణ్‌పై నిర్మాతలు పెట్టే పెట్టుబడి పెరిగింది. పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరైన తర్వాత ఆయన సినిమాలను తెలుగు మార్కెట్‌కే పరిమితం చేయకుండా ప్లాన్ చేస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్'కు భారీగా ఖర్చయింది. దర్శకుడి మేకింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా పాటలు, సెట్స్, యాక్షన్ సన్నివేశాల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కలేదు. ఇంతటి ఖర్చుతో చేసిన సినిమా నిరాశపరిచినా, చరణ్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో బడ్జెట్ తగ్గించాలనే ఆలోచన కనిపించలేదు. కాంబినేషన్స్ వల్ల కూడా లెక్క పెరుగుతోంది.

ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' కూడా భారీ బడ్జెట్ సినిమానే. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు రూ.350 కోట్లు ఖర్చయినట్లు వార్తలొచ్చాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, భారీ సెట్స్ కోసం పెద్ద మొత్తంలో వెచ్చించారు. శంకర్ తీసిన పొలిటికల్ యాక్షన్ డ్రామాకు, బుచ్చిబాబు తెరకెక్కించిన గ్రామీణ కథకు సంబంధం లేకపోయినా రెండు సినిమాల నిర్మాణానికి వందల కోట్లు ఖర్చయ్యాయి.

ఇప్పుడు సుకుమార్‌తో చేస్తున్న RC17కు రూ.400 కోట్ల బడ్జెట్ అంటూ టాక్ వస్తోంది. 'రంగస్థలం' తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేస్తుండటంతో కాంబినేషన్‌పై మంచి అంచనాలున్నాయి. పైగా 'పుష్ప' సినిమాల తర్వాత సుకుమార్ మార్కెట్ కూడా పెరిగింది. దానికి చరణ్ పారితోషికం, పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌కు కూడా భారీ పెట్టుబడి అవసరమవుతోంది.

ఒక్కో సినిమాకు ఒక్కో దర్శకుడు, ఒక్కో జానర్ ఎంచుకుంటున్న చరణ్‌కు ఇప్పుడు భారీ బడ్జెట్‌ను బాక్సాఫీస్ దగ్గర రికవరీ చేయడం కూడా కీలకంగా మారింది. 'గేమ్ ఛేంజర్' ఫలితం ఇందుకు ఒక ఉదాహరణ. పెద్ది కూడా 500 కోట్లు దాటలేదు. ఇక RC17 కాంబినేషన్ తో పక్కా భారీ బాక్సాఫీస్ హిట్టు కొట్టాల్సిందే. ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు.