'పెద్ది' బీస్ట్ లుక్: అసలు ఏం తింటున్నాడురా బాబూ!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన ప్రతి సినిమాకు చూపిస్తున్న డెడికేషన్, మేకోవర్ టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది.
By: Sivaji Kontham | 28 March 2026 6:25 PM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన ప్రతి సినిమాకు చూపిస్తున్న డెడికేషన్, మేకోవర్ టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' కోసం చరణ్ సిద్ధం చేసిన 'బీస్ట్ లుక్' సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. ఈ సరికొత్త లుక్‌లో చరణ్ పర్ఫెక్ట్ ఫిట్ బాడీతో.. అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. చరణ్ ఫిజిక్ చూస్తుంటే 'అసలు ఏం తింటున్నాడురా బాబూ!' అనేంతగా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
చరణ్ కెరీర్‌లో 'ధృవ' సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమా కోసం అతడి మేకోవర్ అప్పట్లో పెద్ద సంచలనం. ఆ చిత్రంలోని సిక్స్ ప్యాక్ లుక్.. పోలీస్ ఆఫీసర్ పాత్రకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్ కోసం చరణ్ రోజుకు దాదాపు మూడు గంటల పాటు జిమ్‌లోనే గడిపాడు. అతడి కఠోర శ్రమకు తగ్గట్టుగానే థియేటర్లలో ఆ లుక్ చూసి ప్రేక్షకులు 'వావ్' అంటూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాతోనే చరణ్ తన ఫిట్‌నెస్ స్థాయిని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు.
ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `ఆర్.ఆర్.ఆర్` చిత్రంలో చరణ్ నటన, లుక్ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాయి. బ్రిటీష్ పోలీస్ అధికారిగా అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం చరణ్ తన శరీరాన్ని మలుచుకున్న తీరు అమోఘం. ముఖ్యంగా ఎంట్రీ సీన్ లో చొక్కా చింపుకుని తలపడే సీన్‌లో అతని రౌద్ర రూపం .. ఫిజిక్ చూసి ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. ఆ సీన్‌లో చరణ్ నిజంగానే ధీరుడిలా కనిపించాడని అభిమానులు కొనియాడారు. చరణ్ లుక్ , స్క్రీన్ ప్రెజెన్స్ ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అమెరికాలోని మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
`ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్ల కోసం అమెరికా వెళ్లినప్పుడు చరణ్ క్రేజ్ మరోస్థాయికి చేరింది. అక్కడ ఒక అమెరికన్ యువతి చరణ్‌కు ప్రపోజ్ చేయడానికి సిద్ధపడిందంటే అతని చరిష్మా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చరణ్ ఇప్పుడు తన తదుపరి చిత్రంతో ఆ స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే 'పెద్ది' కోసం మునుపెన్నడూ లేని విధంగా శ్రమిస్తున్నాడు.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న `పెద్ది` బీస్ట్ లుక్ కోసం చరణ్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ లుక్ సాధించడానికి చరణ్ ప్రతిరోజూ రెండున్నర గంటల పాటు జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. కేవలం జిమ్‌లోనే కాదు.. సినిమా సెట్స్‌పై కూడా సమయం దొరికినప్పుడల్లా వర్కవుట్స్ చేస్తున్నాడట. అతడి కష్టం చూస్తుంటే మెగాస్టార్ కెరీర్ ఆరంభంలో ఎంతగా శ్రమించేవారో ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. హార్డ్ వర్క్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి సుపుత్రుడైన చరణ్‌కు సాటి ఎవరూ లేరని ఈ లుక్ మరోసారి నిరూపించింది. అతడి అంకితభావం చూస్తుంటే పెద్ది చిత్రంలో చరణ్ సరికొత్త యాక్షన్ విధ్వంసం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏ నోట విన్నా పెద్ది అనే పహిల్వాన్ గురించిన చర్చే సాగుతోంది.
