పెద్దితో చిన్నప్పటి కల నెరవేరింది
రెహమాన్ తో పని చేయాలని ప్రతీ హీరో అనుకుంటారు. కానీ కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 9 Nov 2025 2:42 PM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, రీసెంట్ గా ఈ సినిమా నుంచి చికిరి చికిరి అనే ఫస్ట్ లిరికల్ రిలీజైన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
రెహమాన్ కాన్సర్ట్ లో పెద్ది టీమ్ సర్‌ప్రైజ్
ప్రస్తుతం చికిరి సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అయితే రెహమాన్ శనివారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రామ్ ను నిర్వహించగా, ఆ కాన్సర్ట్ కు పెద్ది చిత్ర యూనిట్ హాజరై అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. లైవ్ కాన్సర్ట్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చి బాబు కనిపించడంతో కాన్సర్ట్ మరింత సందడిగా జరిగింది.
రెహమాన్ తో వర్క్ చేయడం చిన్నప్పటి కల
అయితే ఈ ఈవెంట్ లో చరణ్ పెద్ది గురించి, రెహమాన్ గురించి గొప్పగా మాట్లాడారు. చికిరి సాంగ్ నచ్చిందా అని ఆడియన్స్ ను అడిగిన చరణ్, రెహమాన్ సర్ తో కలిసి వర్క్ చేయడం తన చిన్ననాటి కల అని, అది ఇన్నేళ్లకు పెద్ది మూవీతో నిజమవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందని, పెద్ది సినిమా తనకెంతో స్పెషల్ అని వెల్లడించారు.
రెహమాన్ తో పని చేయాలని ప్రతీ హీరో అనుకుంటారు. కానీ కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది. ఎన్నో సినిమాలను తీసి, మెగాస్టార్ గా టాలీవుడ్ లో ఎంతో కాలం పాటూ నెం.1 హీరోగా కొనసాగిన చిరంజీవికి కూడా ఆ భాగ్యం దక్కలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ కు రెహమాన్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందంటూ మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో సంబరపడిపోతున్నారు.
రికార్డు వ్యూస్ సాధించిన చికిరి సాంగ్
ఇక చికిరి సాంగ్ విషయానికొస్తే పెద్ది నుంచి ఫస్ట్ లిరికల్ గా రిలీజైన ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్ లో అన్ని వెర్షన్లలో కలిపి 46 మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకుని ఇండియన్ సాంగ్స్ లోనే ఆల్ టైమ్ రికార్డును సాధించింది. కేవలం తెలుగు వెర్షన్ పాటకే 32 మిలియన్ వ్యూస్ రాగా, హిందీ డబ్ వెర్షన్ 10 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్ లో చరణ్ హుక్ స్టెప్, జాన్వీ గ్లామర్, రెహమాన్ ట్యూన్ చికిరీ పాటకు రిపీట్ వ్యూస్ ను తెస్తుంది.
