Begin typing your search above and press return to search.

ఫ్యానిజం: కారు దిగి వెళుతుంటే చ‌ర‌ణ్‌ని ఆపేసారు

అభిమానం హద్దులు దాటితే అది ఉన్మాదంగా మారుతుందనడానికి ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   1 Feb 2026 11:53 PM IST
ఫ్యానిజం: కారు దిగి వెళుతుంటే చ‌ర‌ణ్‌ని ఆపేసారు
X

అభిమానం హద్దులు దాటితే అది ఉన్మాదంగా మారుతుందనడానికి ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇంత‌కుముందు మ‌లేషియాలో ఒక కార్య‌క్ర‌మం ముగించుకుని తిరిగి చెన్నైకి వ‌చ్చేసిన విజ‌య్ ని అభిమానులు విమానాశ్ర‌యంలో వెంబ‌డించారు. ఆ స‌మ‌యంలో విజ‌య్ త‌న కార్ వైపు వెళుతుంటే సెల్ఫీల పేరుతో విరుచుకు అదుపు త‌ప్పి కింద‌ప‌డ్డారు. దీనికి కార‌ణం అభిమానుల హంగామా..

నేడు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వద్ద రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో జరిగిన ఘటన కూడా అంతే ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు జన్మించారనే వార్త వినగానే మెగా అభిమానుల్లో ఉత్సాహం రావడం సహజమే, కానీ అది ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలా మారడం దురదృష్టకరం.

తన భార్య ఉపాసనను, కవలలను చూడటానికి రామ్ చరణ్ తన చిన్నారి కుమార్తె క్లీంకారతో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే చ‌ర‌ణ్ కారు దిగ‌గానే వంద‌లాది మంది ఫ్యాన్స్ ఒక్క‌సారిగా అక్కడ గుమి గూడారు. చ‌ర‌ణ్ తో సెల్ఫీల కోసం మీదికి ఉరికారు. అభిమానుల హంగామా ఎంత‌గా చికాకు పెట్టిందంటే, కనీసం కారు డోర్ తీసి చరణ్ కిందకు దిగడానికి కూడా వీలు లేకుండా చుట్టుముట్టారు.

అయితే ఆ స‌మ‌యంలో చెర్రీ చేతిలో చిన్నారి క్లీంకార ఉంది. అభిమానుల అరుపులు, కేకలు, తోపులాట చూసి క్లీమ్ భ‌య‌ప‌డి ఏడ్చేసిందిట‌. అలా త‌న కుమార్తెను కాపాడుకుంటూ లోనికి వెళ్లాల్సి వచ్చింది. ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ కొంత అస‌హ‌నానికి గురైనట్టు వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. నిజానికి స‌మ‌యం సంద‌ర్భం లేకుండా అభిమానులు ఇలా చేయ‌డం స‌రైన‌దేనా? .. ఇది ఆస్ప‌త్రి రోగులు ఉండే చోటు! అనే క‌నీస ఇంగితం లేకుండా అలా సెల‌బ్రిటీల‌ను విసిగించ‌డం కూడా ఇబ్బందిక‌రంగా అనిపించింది.

ఇంత‌కుముందు స‌మంత, విజ‌య్ లేదా ఇంకెవ‌రైనా మాబింగ్ కార‌ణంగా ఇబ్బంది ఎదురైన‌ప్పుడు అక్క‌డ స‌రైన నిర్వ‌హ‌ణ లేద‌ని ఆవేద‌న వ్య‌క్త‌మైంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సెల‌బ్స్ ఎంత అసహనానికి గురవుతారో మనం గతంలోనూ చూశాం. కేవ‌లం ఫేవ‌రెట్ హీరోతో సెల్ఫీ కోసం చిన్నారిని కూడా ఇబ్బంది పెట్ట‌డం కోపం తెప్పించింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా కానీ జనం తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రి గేట్ల వద్ద ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం అపోలో ప‌రిస‌రాల్లో అన‌వ‌స‌ర హంగామా లేకుండా, అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.