Begin typing your search above and press return to search.

ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైల‌ర్: క్రేజీ ఫ్యాన్ కోసం హీరో దిగొచ్చాడా?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని (రాపో) కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. ఈ ప్ర‌య‌త్నం అత‌డు న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆంధ్రా కింగ్ తాలూకా`తో నెర‌వేరుతుంద‌ని ఆశిస్తున్నాడు.

By:  Sivaji Kontham   |   18 Nov 2025 9:21 PM IST
ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైల‌ర్: క్రేజీ ఫ్యాన్ కోసం హీరో దిగొచ్చాడా?
X

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని (రాపో) కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. ఈ ప్ర‌య‌త్నం అత‌డు న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆంధ్రా కింగ్ తాలూకా`తో నెర‌వేరుతుంద‌ని ఆశిస్తున్నాడు. ఈ క్రేజీ మూవీ కోసం అభిమానులు కూడా చాలా ఎగ్జ‌యిటింగ్‌గా వేచి చూస్తున్నారు. మహేష్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప‌తాకంపై రవిశంకర్- నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 27 నవంబర్ 2025న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. వివేక్- మెర్విన్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించారు.



ఈ సినిమా పోస్ట‌ర్లు, టీజ‌ర్ సహా సింగిల్స్ కి అద్బుత స్పంద‌న వచ్చింది. ఇప్ప‌టికే రామ్ ఈ సినిమా ప్రివ్యూని వీక్షించి ఈసారి ష్యూర్ షాట్ గా పెద్ద‌ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాన‌నే ధీమాగా ఉన్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అనుకున్న తేదీకి ఒక‌రోజు ముందుకు ప్రీపోన్ చేయ‌డానికి ఈ కాన్ఫిడెన్స్ ఒక కార‌ణం.

ముఖ్యంగా ఈ సినిమా క‌థాంశం ఒక స్టార్ ని తెలుగు రాష్ట్రాల్లోని యూత్ ఎంత‌గా అభిమానిస్తారో తెర‌పై చూపిస్తుండ‌టం, త‌న‌కోసం ఫేవ‌రెట్ స్టార్ ఏదైనా చేయాల‌ని ఆశించ‌ని నిస్వార్థ‌మైన అభిమానాన్ని ఈ మూవీలో చూపిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని సినీ స్టార్ల కోసం ప‌డి చ‌చ్చే క్రేజీ ఫ్యాన్ కల్చర్‌ను హైలైట్ చేస్తుంది. తాజాగా కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమంలో చిత్ర‌బృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా టైటిల్ కి త‌గ్గ‌ట్టే..తన అభిమాన నటుడు సూర్య (ఉపేంద్ర) కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డే, జీవితాన్ని అంకితం చేసే అభిమానిగా సాగర్ (రామ్ పోతినేని) పాత్ర‌ను ఆవిష్క‌రించారు. అత‌డి క‌థ ఆద్యంతం ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

సాగర్ పాత్ర ఆద్యంతం అమాయ‌క‌త్వం, నిజాయితీ క‌ల‌గ‌లుపుతో అభిమానికి సింబాలిక్ గా క‌నిపిస్తోంది. తమ అభిమాన నటుడు ప్రతి అంశంలోనూ ఉన్నతమైనవాడని నిరూపించడానికి యుద్ధాలు చేసే అభిమానుల ప్రేమ‌ను ఇది క‌న‌బ‌రుస్తోంది. అయితే ఈ క‌థ‌లోనే అంద‌మైన అమ్మాయి భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడిన త‌ర్వాత క‌థానాయ‌కుడి జీవితం కీల‌క‌ మలుపు తిరుగుతుంది. త‌న‌కంటూ ఒక జీవితం ఉంటుంద‌ని స్నేహితులు ఎంత చెప్పినా విన‌ని సాగ‌ర్ కి ప్రియురాలి హిత‌వు బాగా ఎక్కిందా లేదా? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

తనకంటూ ఒక జీవితం ఉందని, తనకు తన చుట్టూ ఉన్న వ్యక్తులకు ప్రాముఖ్యత ఇవ్వాలని క‌థానాయిక రామ్ కి నిరంతరం గుర్తు చేస్తుంది. తెర‌పై హీరో కంటే నువ్వే నిజ‌మైన హీరోలా ఉన్నావు! అంటూ ప్ర‌శంసిస్తూ క‌థానాయ‌కుడి పాత్ర‌కు ఉత్ప్రేర‌కంగా భాగ్య‌శ్రీ పాత్ర క‌నిపిస్తోంది. ఈ ట్రైలర్ ఒక అభిమాని క‌థ‌ను అందంగా తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌నే భ‌రోసాను ఇచ్చింది. జీవితంలో ఊహించ‌ని ప‌రిణామాలు ఎదురై అభిమాని పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకున్న‌ప్పుడు అత‌డి కోసం ఆ హీరో దిగి వ‌చ్చాడా లేదా? అన్న‌ది కూడా తెర‌పైనే చూడాలి. ప్ర‌ముఖ హీరో పాత్ర‌లో ఉపేంద్ర న‌టించారు.

ట్రైల‌ర్ ఆద్యంతం ఆహ్లాద‌క‌ర‌మైన విజువ‌ల్స్ తో ఆక‌ట్టుకుంది. ఇక రామ్ ఈ చిత్రంలో మునుప‌టి కంటే ఛామింగ్ గా క‌నిపిస్తున్నాడు. భాగ్య‌శ్రీ‌తో నిజంగానే ప్రేమ‌లో ప‌డ్డాడా? అన్నంత‌గా ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ వ‌ర్క‌వుటైంది.

సంభాషణలు అద్భుతంగా కుదిరాయి. ట్రైలర్ బలమైన భావోద్వేగాల‌తో ఆక‌ట్టుకుంది. ఇది అభిమాని పాయింట్ ఆఫ్ వ్యూలో చ‌క్క‌ని సందేశాన్ని కూడా అందించే సినిమా అవుతుంది. ఈసారి రామ్ త‌న కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటాడ‌నే అభిమానులు ఈ ట్రైల‌ర్ తో డిసైడ్ అయిపోతున్నారు.