Begin typing your search above and press return to search.

మహేష్‌ మూవీ కారణంగా ఆమె డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌...!

ఈ మధ్య కాలంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం అయింది. సినిమాలు లేక అటు ఇటు చూస్తున్న ఈ అమ్మడు స్పైడర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

By:  Ramesh Palla   |   26 Nov 2025 11:58 AM IST
మహేష్‌ మూవీ కారణంగా ఆమె డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌...!
X

'గిల్లి' అనే చిన్న కన్నడ సినిమాతో 2009తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆకట్టుకునే అందంతో పాటు అదృష్టం కలిసి రావడంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో కెరటం సినిమాతో ఎంట్రీ దక్కింది. టాలీవుడ్‌లో ఒక చిన్న హీరోయిన్‌గా, చిన్న సినిమాలతో పరిచయం అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి 2013లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ మంచి బ్రేక్‌ను ఇచ్చింది. ఆ సమయంలో ఉన్న మీడియం రేంజ్ హీరోయిన్స్‌తో పోల్చితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఒక్క హిట్‌ రావడంతో తెలుగులో బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు దక్కించుకుంది. రామ్‌ చరణ్‌ తో బ్రూస్‌లీ సినిమాతో పాటు దాదాపు అందరు స్టార్‌ హీరోలతో సినిమాలను చేసింది. ఒకానొక సమయంలో మహేష్‌ బాబు వంటి స్టార్‌ హీరో సినిమాకు ఈమె డేట్లు లేక పోవడంతో నో చెప్పింది అనే వార్తలు వచ్చాయి.

మహేష్‌ బాబుతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌...

మహేష్‌ బాబు బ్రహ్మోత్సవం సినిమా కోసం ఈమెను సంప్రదించారని, కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో ఈమె నటించలేక పోయింది. అయితే వెంటనే ఈ అమ్మడికి మహేష్‌ బాబుతో స్పైడర్‌ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా మరీ ఇంత చెత్తగా ఉందేంట్రా బాబోయ్‌ అంటూ చాలా మంది అభిమానులే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహేష్‌ బాబుతో ఇలాంటి సినిమాను తీసినందుకు గాను మురుగదాస్‌ను ఏం చేసినా తప్పు లేదు అంటూ ఆ సమయంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఆ సినిమా గురించి ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య కాలంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం అయింది. సినిమాలు లేక అటు ఇటు చూస్తున్న ఈ అమ్మడు స్పైడర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

మురుగదాస్‌ స్పైడర్ సినిమాలో హీరోయిన్‌...

ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. ఆ సమయంలోనే మీ కెరీర్‌లో అతి పెద్ద ఫెయిల్యూర్ అంటే దేన్ని చెప్తారు అంటూ హోస్ట్‌ ప్రశ్నించిన సమయంలో ఆమె కాస్త ఆలోచించి మహేష్‌ బాబు, మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్‌ సినిమా అంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమా నా ఫెయిల్యూర్‌ కాదు, కానీ ఆ ఫెయిల్యూర్‌ వల్ల తన కెరీర్‌ చాలా ఎఫెక్ట్‌ అయిందని చెప్పుకొచ్చింది. ఆ ఫెయిల్యూర్‌ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇలా ఉంటుంది అని అర్థం అయింది. పైకి ఎదిగినప్పుడు పడి పోతాం అనే విషయం స్పైడర్‌ సినిమాతో అర్థం అయిందని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆ సినిమా చేయడం పట్ల ఇండైరెక్ట్‌గా పశ్చాతాపం వ్యక్తం చేసింది. మహేష్‌ బాబు, మురుగదాస్‌ వంటి స్టార్స్‌ తో సినిమా అంటే చాలా ఊహించుకున్నాను అని, కానీ మొత్తం తలకిందులు అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

స్పైడర్‌ సినిమా తర్వాత రకుల్‌ ప్రీత్‌సింగ్‌...

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కెరీర్‌ ఈ మధ్య అస్సలు బాగాలేదు. కాస్త డెప్త్‌గా ఈమె కెరీర్‌ను విశ్లేషిస్తే స్పైడర్‌ సినిమా నుంచే ఈమె డౌన్‌ ఫాల్‌ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. తాజాగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఫీల్‌ అవుతున్నదాన్ని బట్టి చూస్తే ఆమె కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవైళ స్పైడర్‌ సినిమా కనుక రకుల్‌ చేసి ఉండకుంటే తప్పకుండా మరిన్ని మంచి సినిమా ఆఫర్లు ఈమె దక్కించుకుని ఉండేది, ఇప్పటి వరకు కూడా సినిమాలతో బిజీగా ఉండేదేమో అన్నట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌ లో ఆఫర్లు లేకున్నా బాలీవుడ్‌లో ఆఫర్లతో కెరీర్‌ ను నెట్టుకు వస్తుంది. అయితే టాలీవుడ్‌లో మళ్లీ బిజీ కావాలని ఈ అమ్మడు చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పెళ్లి చేసుకున్న కారణంగా రకుల్‌ టాలీవుడ్‌లో మళ్లీ ఫామ్‌లోకి రావడం దాదాపు అసాధ్యం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.