Begin typing your search above and press return to search.

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

తనకు స్టార్‌డమ్, గుర్తింపు ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమేనని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్ తనకు పని విలువ నేర్పిందని, ఈ స్థాయికి ఎదగడానికి బలమైన పునాది వేసిందని తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రొటీన్‌కు భిన్నంగా సవాల్ విసిరే పాత్రలు, కొత్త తరహా కథల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   22 Nov 2026 12:18 AM IST
న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!
X

చాలామంది ఏరు దాటాక తెప్ప త‌గలేస్తున్నారు. టాలీవుడ్‌లో అవ‌కాశాలు అందుకుని తెలుగు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొంది.. అటుపై బాలీవుడ్ కి వెళ్లాక తెలుగు ద‌ర్శ‌కులు.. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.. అయితే అందుకు భిన్నంగా త‌న‌కు అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేసిన ప‌రిశ్ర‌మ‌ను ఇప్ప‌టికీ గుర్తు చేసుకుని మ‌న‌సుల్ని హ‌త్తుకునేవిధంగా మాట్లాడారు ర‌కుల్ ప్రీత్ సింగ్.





ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి పూర్తి క్రెడిట్ తెలుగు చిత్ర పరిశ్రమకే దక్కుతుందని రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు. టాలీవుడ్ తనను తీర్చిదిద్దిందని.. పని విలువ నేర్పిందని.. స్టార్‌డమ్‌తో పాటు తాను కోరుకున్నదంతా ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఎదిగిన మూలాలను మర్చిపోకుండా ఇక్కడి పరిశ్రమ ఇచ్చిన ప్రోత్సాహాన్ని పదేపదే ప్రశంసించడంపై నెటిజన్లు, సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.





తెలుగులో అగ్ర హీరోల సరసన వరుస విజయాలు అందుకున్న రకుల్.. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్టులలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా `రామాయణం` చిత్రంలో శూర్పణఖ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు తన నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాత రొటీన్ పాత్రలకు భిన్నంగా.. నటిగా తనకు సవాలు విసిరే స్క్రిప్ట్‌ల కోసమే ఎదురుచూస్తున్నట్లు ర‌కుల్ వెల్లడించారు.





ప్రస్తుతం తాను విభిన్నమైన పాత్రల కోసం వెతుకుతున్నాను.. కొత్త తరహా కథల కోసం ఎదురు చూస్తున్నానని రకుల్ పేర్కొన్నారు. కెరీర్ ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు తన సంకల్పంలో ఎలాంటి మార్పు లేదని.. అత్యంత కష్టపడి పనిచేయడమే తన స‌క్సెస్ సీక్రెట్ అని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి షార్ట్‌కట్‌లు ఉండవు.. నిరంతర శ్రమ, నిజాయితీ మాత్రమే ముందుకు నడిపిస్తాయని ర‌కుల్ అభిప్రాయపడ్డారు.





హిందీ చిత్ర‌సీమ‌కు వెళ్లిపోయినా తన కెరీర్‌కు బలమైన పునాది వేసిన టాలీవుడ్‌ను గౌరవించడం రకుల్ సంస్కారానికి నిదర్శనంగా నిలుస్తోంది. సవాల్ విసిరే పాత్రలతో మునుముందు ర‌కుల్ నుంచి స్పెష‌ల్ ట్రీట్ ని ఆశించ‌వ‌చ్చు. అయితే ర‌కుల్ లాంటి అంద‌గ‌త్తె నుంచి అభిమానులు కోరుకునే గ్లామ‌ర‌స్ ట్రీట్ కి మాత్రం కొద‌వ ఉండ‌కూడ‌దు.