Begin typing your search above and press return to search.

ఫిల్మ్ ఇండస్ట్రీలో PRs.. రకుల్ ఒపీనియన్ ఏంటి?

ఇతరుల గురించి చెడుగా రాయించడం, బురద చల్లడం ఇప్పుడు సాధారణమైపోయిందని రకుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

By:  M Prashanth   |   3 Feb 2026 3:28 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో PRs.. రకుల్ ఒపీనియన్ ఏంటి?
X

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో.. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రస్తుతం పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) సంస్కృతి ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. మూవీ రిలీజ్ అయినా, వ్యక్తిగత విషయాలైనా.. ప్రతి అంశంలో పీఆర్ టీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఆ వ్యవస్థలపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఆర్ వల్లే స్టార్‌ డమ్ వస్తుందనే ఫీలింగ్ ను ఖండించారు.

ప్రమోషన్స్, లాబీయింగ్ కంటే కష్టం, టాలెంట్ నటుడిని నిలబెడుతుందని ఆమె స్పష్టం చేశారు. డబ్బు పెట్టి పబ్లిసిటీ చేసుకోవడం కంటే నిజాయితీగా వర్క్ చేస్తే ప్రేక్షకుల ప్రేమ ఎవరికైనా దక్కుతుందని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్, పీఆర్ వ్యవస్థలపై తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పీఆర్ వ్యవస్థలు ఒక స్థాయి వరకు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. మనం ఎంత కష్టపడి పని చేస్తామో, మన టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అదే కెరీర్‌ ను డిసైడ్ చేస్తుందని అన్నారు. కేవలం ప్రచారం వల్ల ఎక్కువ రోజులు ఎవ్వరూ నిలబడలేరని క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు.

కొందరు డబ్బు చెల్లించి ఇతరులపై నెగిటివ్ ప్రచారం చేయించడం బాధాకరమని అన్నారు. ఇతరుల గురించి చెడుగా రాయించడం, బురద చల్లడం ఇప్పుడు సాధారణమైపోయిందని రకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నెగిటివిటీ సృష్టించే వాళ్ళకి నిద్ర ఎలా పడుతుందో తనకు అర్థం కావడం లేదని రకుల్.. వాళ్లకు మనస్సాక్షి ఉండదా అని ఎప్పుడు అనిపిస్తుందని చెప్పారు.

అదే సమయంలో ఇలాంటి మార్గాలు ఎంచుకునే వారు ఎప్పటికైనా సమస్యలు ఎదుర్కొంటారని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అందుకే తాను ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించనని, కేవలం పని నిజాయితీగా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే తానెక్కడికి చేరుకున్నానో అదంతా కష్టం వల్లేనని చెప్పిన అమ్మడు.. తనకు ప్రత్యేకంగా పీఆర్ అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఫోటోగ్రాఫర్ల ప్రవర్తనపై కూడా అసహనం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని అతిగా పరిశీలించడం సరైంది కాదన్నారు. "నేను ఒకే జీన్స్‌ను నెలలో ఐదు సార్లు వేసుకుంటాను. దాన్ని గమనించి కామెంట్ చేస్తారు. దుస్తులపై అంతగా ఫోకస్ చేయడం అవసరమా అనిపిస్తుంది’" అని అన్నారు. తాను ఫ్యాషన్‌ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని, కంఫర్ట్‌ ముఖ్యంగా భావిస్తానని చెప్పారు. ఎలాంటి డ్రెస్ వేసుకున్నానన్నది కంటే క్యారెక్టర్, పని ముఖ్యమని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో నిజమైన టాలెంట్‌ కే స్థానం ఉంటుందని, కష్టపడే వారిని ప్రేక్షకులు ఆదరిస్తారని రకుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.