బాహుబలి లాంటి సినిమా కావాలట
రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న రకుల్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీ డ్రీమ్ రోల్ ఏంటి అని అడిగితే, ఆమె టక్కున చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
By: M Prashanth | 19 Dec 2025 1:52 PM ISTరకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు మొన్నటి వరకు టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అయ్యింది. స్టార్ హీరోలందరితో ఆడిపాడి, వరుస హిట్లతో దూసుకుపోయింది. కానీ ఈ మధ్య కాలంలో మన తెలుగు స్క్రీన్ మీద రకుల్ కనిపించడం చాలా అరుదుగా మారింది. బాలీవుడ్ లో బిజీగా ఉన్నా, ఇక్కడ మాత్రం ఆమె ఫ్యాన్స్ కు ఒక వెలితిగానే ఉంది. సరైన సక్సెస్ లేక, గట్టి ఆఫర్స్ రాక రకుల్ కెరీర్ గ్రాఫ్ ఇక్కడ కొంచెం డల్ అయ్యిందనే చెప్పాలి.
రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న రకుల్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీ డ్రీమ్ రోల్ ఏంటి అని అడిగితే, ఆమె టక్కున చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. తనకు తెలుగులో "బాహుబలి" లాంటి భారీ సినిమా పడాలని, అలాంటి ఎపిక్ సినిమాలో నటించడమే తన డ్రీమ్ రోల్ అని మనసులో మాట బయటపెట్టింది. ఆ మాట చెప్పేటప్పుడు ఆమె కళ్ళలో ఆ ఆశ స్పష్టంగా కనిపించింది.
బాహుబలి సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచడమే కాదు, అందులో నటించిన వారికి లైఫ్ టైమ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్స్ కు ఆ సినిమా ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోయింది. రకుల్ కూడా సరిగ్గా అలాంటి ఛాన్స్ కోసమే ఎదురుచూస్తోంది. రొటీన్ గ్లామర్ పాత్రలు, లవ్ స్టోరీలు కాకుండా, తనలోని నటిని పూర్తిగా బయటకు తీసే, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా చేయాలని ఆమె బలంగా కోరుకుంటోంది.
ప్రస్తుతం రకుల్ లైనప్ చూస్తే ఎక్కువగా హిందీ సినిమాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 'దే దే ప్యార్ దే 2', 'మేరే హస్బెండ్ కీ బీవీ' వంటి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటించింది. సౌత్ లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ తో 'భారతీయుడు 2' లో దిశా అనే పాత్రలో కనిపించినా, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె ఆశలన్నీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న 'భారతీయుడు 3' పైనే ఉన్నాయి. కానీ అ సినిమా ఎప్పుడు వస్తుందో సరైన క్లారిటీ లేదు.
ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా వెలుగొందిన రకుల్ కు, ఈ మధ్య కాలంలో టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం, కొత్తగా తెలుగులో పెద్ద అవకాశాలు రాకపోవడం ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. టాలెంట్, గ్లామర్ రెండూ ఉన్నా, సరైన స్క్రిప్ట్ పడకపోవడమే మైనస్ అవుతోంది. అందుకే ఇప్పుడు కమర్షియల్ హిట్స్ కంటే, తన స్థాయిని పెంచే 'బాహుబలి' లాంటి భారీ ప్రాజెక్ట్స్ వైపు చూస్తోంది. మరి రకుల్ కోరుకున్నట్లు ఆ రేంజ్ ఆఫర్ తలుపు తడుతుందో లేదో చూడాలి.
