Begin typing your search above and press return to search.

నాగ్ ‘రక్షకుడు’ ఇంపాక్ట్ అలాంటిది మరి

అప్పట్లో చిన్న పిల్లలుగా ఉన్న వాళ్లు, యూత్‌‌గా ఉన్న వాళ్లు మీద ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది అంటే అతిశయోక్తి కాదు.

By:  Garuda Media   |   13 Oct 2025 8:30 PM IST
నాగ్ ‘రక్షకుడు’ ఇంపాక్ట్ అలాంటిది మరి
X

అక్కినేని నాగార్జున కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ‘రక్షకుడు’. కానీ ఆ సినిమా విడుదలకు ముందు వచ్చిన హైప్ మాత్రం అంతా ఇంతా కాదు. అప్పటికి సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కడమే కాదు.. అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగానూ అది రికార్డు నెలకొల్పింది. నాగార్జున తమిళ హీరో కాకపోయినా.. అక్కడ ఈ చిత్రానికి బంపర్ క్రేజ్ వచ్చింది. ఇక తెలుగు సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అందులో నాగ్ లుక్, మేనరిజమ్స్‌ పెద్ద సెన్సేషనే అయ్యాయి.

అప్పట్లో చిన్న పిల్లలుగా ఉన్న వాళ్లు, యూత్‌‌గా ఉన్న వాళ్లు మీద ఇప్పటికీ ఆ ప్రభావం ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇందుకు తాజా ఉదాహరణ తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘బిగ్ బాస్’ షోలో చెప్పిన సంగతులు.

ప్రదీప్ స్కూల్ రోజుల్లో ఉండగా ‘రక్షకుడు’ రిలీజైందట. ఆ సినిమాలో నాగ్ ఫంక్ హేర్ స్టైల్ చూసి పిచ్చెక్కిపోయాడట ప్రదీప్. ఐతే స్కూలుకు వెళ్తూ అలా జుట్టు పెంచడం సాధ్యం కాదు కాబట్టి ఆ ఆశ తీర్చుకోలేకపోయాడట ప్రదీప్.

ఐతే కాలేజీ రోజులకు వచ్చాక కొన్ని నెలల పాటు జుట్టు పెంచి సెలూన్‌కు వెళ్లి, ‘రక్షకుడు’లో నాగ్ లాగే వెనుక జుట్టు వదిలే సైడ్‌లో మాత్రమే హేర్ కట్ చేయించాడట. ఐతే లెంగ్తీ హేర్‌తో హుషారుగా ఇంటికి వెళ్తే.. ప్రదీప్ తల్లి ఇంట్లోకే రానివ్వలేదట. రౌడీలా ఉన్నావంటూ జుట్టు కత్తిరించుకున్నాకే ఇంట్లోకి రావాలని కండిషన్ పెట్టిందట. ఐతే కాలేజీలో అందరికీ, ముఖ్యంగా ఓ అమ్మాయికి ఈ హేర్ స్టైల్ చూపించి తర్వాత కట్ చేయించుకుంటా అని తన తల్లిని ఒప్పించాడట ప్రదీప్. అలా కాలేజీలో స్టైల్ కొట్టాక వారం తర్వాత వేరే సెలూన్‌కు వెళ్లి జుట్టు కత్తిరించుకున్నాడట ప్రదీప్. ఐతే అప్పుడు తన తల్లి మాటకు అడ్డు చెప్పే పరిస్థితి లేదని.. కానీ ఇప్పుడు తన ఇష్టం కాబట్టి మళ్లీ ‘రక్షకుడు’లో నాగ్‌లా జుట్టు పెంచుతున్నట్లు నాగ్ ముందు ప్రదీప్ వెల్లడించాడు.

ఇంతకుముందు ‘కూలీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సైతం ఇలాగే ‘రక్షకుడు’ స్ఫూర్తితో జుట్టు పెంచినట్లు వెల్లడించడం విశేషం. దీన్ని బట్టే తెలుగు వాళ్లే కాక.. ఒకప్పటి తమిళ యూత్ కూడా ‘రక్షకుడు’లో నాగ్ స్టైల్‌కు పిచ్చెక్కిపోయారని అర్థమవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రదీప్ మీద నాగ్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. నాలుగైదు దశాబ్దాల వెనుక సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి సినీ పరిశ్రమ రూపు రేఖలనే మార్చేశారని.. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు ధనుష్ ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడని.. ఇప్పుడు ప్రదీప్ కూడా అలాగే యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించాడని నాగ్ కొనియాడాడు. ప్రదీప్ లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు తనకెంతో నచ్చాయని నాగ్ చెప్పాడు.