Begin typing your search above and press return to search.

ఒక చిన్న హీరో కోసం పెద్ద హీరోని ప‌క్క‌న పెట్టిన ద‌ర్శ‌కుడు!

బాలీవుడ్ చిత్రసీమలో ఖాన్‌ల త్రయంలో ఒకడిగా ఏలుతున్న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన సినిమా అంటే ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన హిందీ సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకులు, వెటరన్ కింగ్ పిన్‌లతో కలసి పనిచేస్తుంటారు.

By:  Sivaji Kontham   |   30 Aug 2026 12:08 PM IST
ఒక చిన్న హీరో కోసం పెద్ద హీరోని ప‌క్క‌న పెట్టిన ద‌ర్శ‌కుడు!
X

బాలీవుడ్ చిత్రసీమలో ఖాన్‌ల త్రయంలో ఒకడిగా ఏలుతున్న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన సినిమా అంటే ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన హిందీ సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకులు, వెటరన్ కింగ్ పిన్‌లతో కలసి పనిచేస్తుంటారు. ఈ క్రమంలోనే దిగ్గజ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రాతో కలసి అత‌డు ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చర్చలు జరిపారు. అయితే ఇంతటి భారీ స్టార్‌ను కాదని దర్శకుడు ఇప్పుడు ఒక చిన్న హీరోతో సినిమా చేస్తున్నార‌ని స‌మాచారం. దీంతో ఒక చిన్న హీరో కోసం పెద్ద హీరోని పక్కన పెట్టారా? ఆ చిన్న హీరో బాలీవుడ్‌లో అంతగా ప్రభావం చూపుతున్నాడా? అనే చర్చ ప్రస్తుతం బి-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సల్మాన్ ఖాన్ - రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రాల కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మరేదో కాదు.. మహాభారతంలోని అత్యంత కీలకమైన పాత్ర ఆధారంగా తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ డ్రామా `కర్ణ`. ఈ ప్రాజెక్ట్ స్కేల్, గ్రాండియారిటీ కారణంగా భారీ బడ్జెట్ అవసరమవుతోంది. పైగా దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని రాకేష్ మెహ్రా భావిస్తున్నారు. ఇలాంటి అత్యంత కీలకమైన.. ప్రతిష్టాత్మకమైన సినిమాను అకస్మాత్తుగా హోల్డ్‌లో పెట్టి..ఒక చిన్న హీరోతో ప్రాజెక్ట్ ప్రారంభించాలని దర్శకుడు నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరో సినిమాకు సడెన్‌గా గ్యాప్ ఇవ్వడానికి బలమైన కారణాలే ఉన్నాయి. `కర్ణ` అనేది సుదీర్ఘమైన ప్రీ-ప్రొడక్షన్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ సెట్స్‌తో కూడుకున్న కాన్సెప్ట్. దీనికోసం దాదాపు ఐదేళ్ల సమయం పడుతుంది. అందుకే ఈ సుదీర్ఘ నిరీక్షణ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా దర్శకుడు రాకేష్ మెహ్రా బాలీవుడ్ యంగ్ టాలెంట్ విక్రాంత్ మాస్సేతో ఒక సేఫ్ ప్రాజెక్టును మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు.

ఈ నిర్ణయం వెనుక మరొక ఆసక్తికరమైన బాక్సాఫీస్ లెక్క కూడా ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల `ట్వెల్త్ ఫెయిల్` వంటి చిన్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందించి.. భారీ లాభాలు తెచ్చిపెట్టిన నటుడు విక్రాంత్ మాస్సే. అతి తక్కువ బడ్జెట్- తక్కువ సమయంలో ప్రేక్షకాదరణ పొందేలా చేయడంలో ఆయన సిద్ధహస్తుడని నిరూపితమైంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ఇటీవలి కెరీర్ ట్రాక్ రికార్డ్ ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో విక్రాంత్ మాస్సేతో కేవలం 30 రోజుల్లో ఒక చిన్న సినిమా పూర్తి చేసి.. సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత తెలివిగా సల్మాన్ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చని దర్శకుడు భావిస్తున్నారు.

ఏది ఏమైనా.. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తీసుకున్న ఈ నిర్ణయం చాలా తెలివైనదిగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు విక్రాంత్ మాస్సేతో చేసే చిన్న ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తవుతుండగా.. మరోవైపు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ టెక్నిక‌ల్ టీమ్ `కర్ణ` ప్రీ-ప్రొడక్షన్ పనులను పక్కాగా సిద్ధం చేస్తోంది. ఒక చిన్న హీరో తెచ్చిన నమ్మకంతో పెద్ద హీరో ప్రాజెక్ట్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు మెహ్రా వేస్తున్న ఈ అడుగులు బాలీవుడ్‌లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి.