తండ్రీ-కుమార్తెల భాద ఒకరికి తెలియకుండా మరొకరు!
సునైనా రోషన్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా `డాడ్ & ఐ అన్ ఫిల్టర్డ్` పేరుతో ప్రారంభించిన ప్రత్యేక సిరీస్‌లో భాగంగా తన తండ్రితో మనసు విప్పి మాట్లాడారు.
By: Srikanth Kontham | 8 Aug 2026 12:38 PM ISTబాలీవుడ్ దర్శక-నిర్మాత రాకేష్ రోషన్ కుటుంబం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన కుమార్తె సునైనా రోషన్ గతంలో పలుమార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కూతురు పడిన అనారోగ్య బాధను చూసి తాను లోలోపల ఎంతగా కుంగిపోయారు? ఆ సమయంలో తండ్రిగా తాను ఎలా వ్యవహరించారు? అన్నది తాజాగా రాకేష్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సునైనా రోషన్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా `డాడ్ & ఐ అన్ ఫిల్టర్డ్` పేరుతో ప్రారంభించిన ప్రత్యేక సిరీస్‌లో భాగంగా తన తండ్రితో మనసు విప్పి మాట్లాడారు.
తన ఆరోగ్యం అత్యంత క్లిష్టకరంగా మారిన సమయంలో తండ్రిగా ఆయన ఏవిధమైన మానసిక వేదనను అనుభవించారని ఆమె ప్రశ్నించారు. దీనికి రాకేష్ రోషన్ స్పందించారు. ఆ సందర్భాలు ఒక్కసారి కాదని, కూతురు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను ఎన్నోసార్లు నిశ్శబ్దంగా ప్రార్థనలు చేశానని వెల్లడించారు.
కూతురిని పరామర్శించడానికి వెళ్లే ముందు కళ్లలోని కన్నీళ్లను పూర్తిగా తుడిచేసుకుని ముఖంలో చిరునవ్వుతో ఆమె ముందుకు వెళ్లేవాడినని రాకేష్ రోషన్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉంటుందని.. అందుకే తాను తన బాధను బయటపెట్టకుండా ఎప్పుడూ ఒక బలమైన శక్తిలా నిలబడ్డానని పేర్కొన్నారు. తాను పడిన వేదనను కూతురికి తెలియకుండా దాచడం ద్వారా ఆమెకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినట్లు రాకేష్ తెలిపారు.
మరోవైపు కూతురు సునైనా కూడా తండ్రి పట్ల తనకున్న గౌరవాన్ని, భావోద్వేగాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. తన తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ సోకిన సమయంలో తాను కూడా ఇదే పద్ధతిని అనుసరించానని ఆమె గుర్తు చేసుకున్నారు. తండ్రి ముందు ఎంతో ధైర్యంగా, నవ్వుతూ కనిపించినా? గదికి వెళ్లిన తర్వాత తాను ఒంటరిగా బోరు న ఏడ్చేదానని తెలిపారు. అద్దం ముందు నిలబడి తనకు తానుగా నవ్వుకోవడం నేర్చుకుని, ఆపై తండ్రిని చిరునవ్వుతో పలకరించేదినని వెల్లడించారు.
తల్లిదండ్రులు తమ కష్టాలను, భయాలను పక్కనపెట్టి పిల్లల కోసం ఎంతో సానుకూల దృక్పథంతో నిలబ డతారనడానికి తమ కుటుంబంలో జరిగిన ఈ సంఘటనలే నిదర్శనమని సునైనా అభివర్ణించారు. క్లిష్ట పరిస్థితుల్లో తల్లిదండ్రులు ప్రదర్శించే అంతులేని సంకల్పం, బలామే పిల్లలకు అసలైన జీవన పాఠాలను నేర్పుతుందని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయాలు విన్న నెటిజన్లు రోషన్ కుటుంబం చూపించిన పరస్పర ప్రేమకు, మానసిక ధైర్యానికి భావోద్వేగంతో స్పందిస్తున్నారు.
రోషన్ కుటుంబానికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు. కష్ట కాలంలో ఒకరికొకరు అండగా నిలబడటమే నిజమైన కుటుంబ బంధానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కొని కుటుంబం అంతా కలిసి మెలిసి ప్రతికూల పరిస్థితులను జయించిన అనుభవాలు రాకేష్ రోషన్ కుటుంబానికి సమాజంలో మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు.
