జీ5 నిర్మించినా ఓటీటీ రైట్స్ వీళ్లకే అనే రూలేమీ లేదు!
నిహారిక కొణిదెల నిర్మించిన `రాకాస` సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
By: Sivaji Kontham | 2 March 2026 9:30 AM ISTనిహారిక కొణిదెల నిర్మించిన `రాకాస` సినిమా చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా ఒక నిర్మాణ సంస్థ సినిమాను నిర్మిస్తే.. వారి సొంత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనే ఆ చిత్రం విడుదలవుతుందని అందరూ భావిస్తారు. అయితే జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో రూపొందిన `రాకాస` చిత్ర డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీ5 సంస్థ ప్రొడ్యూస్ చేసి, ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కు ఇవ్వడం ఏంటి? అనే ప్రశ్న ఇప్పుడు ఒక జర్నలిస్ట్ నుంచి సూటిగా తాకింది.
ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. దివ్య విజయ్ మాట్లాడుతూ.... జీ5 స్టూడియోస్ అనేది సినిమాల నిర్మాణం వరకే.. ఓటీటీ హక్కులు తమకే ఉండాలని భావించరు.. అని తెలిపారు. చిత్రనిర్మాత నిహారిక కూడా దీనిపై స్పందిస్తూ.. తమ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ - జీ స్టూడియోస్ మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే సినిమా బిజినెస్ డీల్స్- గ్లోబల్ రీచ్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కంటెంట్ నాణ్యతను బట్టి.. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ ధరకు దక్కించుకోవడం విశేషం.
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సంగీత్ శోభన్, సినిమాలోని హారర్ , కామెడీ ఎలిమెంట్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో జరిగిన వినోదాత్మక సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఈ సినిమా ప్రేక్షకులను అటు భయపెడుతూనే ఇటు కడుపుబ్బ నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ మార్క్ హ్యూమర్, సంగీత్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ హారర్ కామెడీపై అంచనాలు భారీగా పెరిగాయి.
సాంకేతిక పరంగాను `రాకాస` చిత్రం ఎంతో బలంగా కనిపిస్తోంది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందించారు. నయన్ సారిక కథానాయికగా నటించగా, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఒక వైపు జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉండి, మరో వైపు నెట్‌ఫ్లిక్స్ వంటి అగ్ర ఓటీటీ సంస్థ డిజిటల్ రైట్స్ దక్కించుకోవడం ఈ సినిమా కంటెంట్‌కు ఉన్న క్రేజ్‌ను సూచిస్తోంది. నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తున్న నిహారిక కొణిదెలకు ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
