బ్రహ్మ రాక్షసుడి బలి.. ‘రాకస’ ట్రైలర్ ఎలా ఉందంటే..
ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే కొన్ని షాట్స్ సినిమాలోని సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చాయి.
By: M Prashanth | 25 March 2026 8:40 PM ISTటాలీవుడ్‌లో ఇటీవల హారర్, ఫాంటసీ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాకస’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. లేటెస్ట్ గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఒక కొత్త తరహా ఫోక్ లోర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. భయం, నమ్మకం, ఆచారాల చుట్టూ తిరిగే ఈ కథలో విజువల్స్ పక్కాగా కుదిరాయి. ఊరి జనాన్ని భయపెట్టే ఒక బ్రహ్మ రాక్షసుడు, అతనికి ఇచ్చే బలి చుట్టూ ఉన్న రహస్యాలను వెతుకుతూ వెళ్ళే కుర్రాడిగా సంగీత్ శోభన్ నటన ఆకట్టుకునేలా ఉంది.
“కోటలో ఉన్నది.. ఊరు బలి పంపుతున్నది.. సామాన్యుడికి కాదు, భీకర బ్రహ్మ రాక్షసుడికి” అనే డైలాగ్ ఈ సినిమా కథపై ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఒక మూసి ఉన్న కోట, అక్కడ జరిగే నిగూఢ ఆచారాలు, ఆ ఊరి మనుషుల మరణాలు సినిమాను ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచాయి. బ్రహ్మాజీ వంటి సీనియర్ నటుల కామెడీ టైమింగ్ కూడా ఇందులో సహజంగా ఇమిడిపోయింది.
సీరియస్ కథాంశంలో అక్కడక్కడా హాస్యం ఉండటం వల్ల ఆడియన్స్‌కు బోర్ కొట్టకుండా ఉండే అవకాశం ఉంది. టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టార్చ్ లైట్ వెలుతురులో తీసిన సీన్లు, అడవి లోపల కోట సెట్టింగ్స్ ఒక రకమైన అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేశాయి. అనూదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ స్థాయిని పెంచింది.
ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే కొన్ని షాట్స్ సినిమాలోని సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చాయి. దర్శకురాలు మానస శర్మ తన డెబ్యూ ఫిల్మ్ తోనే ఒక ప్రయోగాత్మక సబ్జెక్టును ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ వ్యూస్ కూడా భారీగానే వస్తున్నాయి. టీజర్ ఇప్పటికే 3 మిలియన్ల మార్కును దాటడం, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగుంటాయని ట్రేడ్ వర్గాల అంచనా.
నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ హంగులతో సిద్ధం చేశారు. ఏప్రిల్ 2న ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో మొదలయ్యే ఈ సినిమా, ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఒక వైపు పెద్ద సినిమాల హడావిడి ఉన్నా, ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు యూత్ లో క్రేజ్ ఉంటుంది. ‘రాకస’ చిత్రంలో కూడా కంటెంట్ కనిపిస్తోంది. నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి నటులు ఉన్నారు. మరి ఈ బ్రహ్మ రాక్షసుడి మిస్టరీని వీర ఎలా ఛేదించాడనేది వెండితెరపైనే చూడాలి.
