రాజు వెడ్స్ రాంబాయి.. 3 రోజుల లెక్క ఎంతంటే?
'రాజు వెడ్స్ రాంబాయి'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
By: M Prashanth | 24 Nov 2025 1:12 PM ISTబాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఏ మ్యాజిక్ జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. స్టార్ హీరోలు లేరు, భారీ బడ్జెట్ లేదు.. అయినా సరే థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కంటెంట్ ఉంటే జనం నెత్తిన పెట్టుకుంటారని మరోసారి రుజువైంది. కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తున్న ఒక చిన్న సినిమా, ఇప్పుడు ట్రేడ్ వర్గాల లెక్కలను తారుమారు చేస్తోంది.
'రాజు వెడ్స్ రాంబాయి'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. క్రిటిక్స్ సైతం ఈ 'కల్ట్' సినిమాను ప్రశంసిస్తున్నారు. మొదట చిన్న సినిమాగా రిలీజ్ అయినా, ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇది పెద్ద రేంజ్ హిట్టు దిశగా వెళ్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు ఎక్కువగా రావడం నిజంగా విశేషం. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 7.28 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిందని మేకర్స్ చెబుతున్నారు. ఒక కొత్త హీరో, కొత్త డైరెక్టర్ సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.
సాయిలు కంపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి గ్రాండ్ గా రిలీజ్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అఖిల్ రాజ్, తేజస్విని తమ నటనతో ఆడియన్స్ ను కట్టిపడేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషన్స్, రా అండ్ రస్టిక్ మేకింగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అందుకే జనం థియేటర్లకు క్యూ కడుతున్నారని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమా విజయం వెనుక టెక్నికల్ టీమ్ కృషి కూడా ఉంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ను బాగా ఎలివేట్ చేశాయి. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాణ విలువలు సినిమాను రిచ్ గా చూపించాయి. 99 రూపాయల టికెట్ ధర కూడా ఈ కలెక్షన్స్ కి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
'రాజు వెడ్స్ రాంబాయి' బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ గా వచ్చి వయొలెంట్ హిట్ కొట్టింది. మూడు రోజుల్లోనే 7 కోట్లు దాటడం అంటే, లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. చిన్న సినిమాలకు ఇదొక ఊపిరి పోసిన విజయమని అంటున్నారు. కంటెంట్ బాగుంటే కలెక్షన్స్ వాటంతట అవే వస్తాయని మేకర్స్ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు.
