'రాజు వెడ్స్ రాంబాయి' అసలు లెక్కలివే.. బన్నీ వాసు
కంటెంట్ కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని 'రాజు వెడ్స్ రాంబాయి' మరోసారి నిరూపించింది.
By: M Prashanth | 29 Dec 2025 3:57 PM ISTఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ రేటును అందుకుంటున్నాయి. కంటెంట్ కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని 'రాజు వెడ్స్ రాంబాయి' మరోసారి నిరూపించింది. అయితే బయట కనిపిస్తున్న విజయం వెనుక కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు ఉన్నాయి. సినిమా హిట్ అని అందరికీ తెలుసు కానీ, అది ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందనే విషయంలో మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు. లేటెస్ట్ గా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాసు, వంశీ నందిపాటి ఓ ఇంటర్వ్యూలో అసలు లెక్కలు బయటపెట్టారు.
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే అన్ని ఏరియాల్లోనూ ఒకేలా ఆడుతుందని అనుకుంటాం. కానీ 'రాజు వెడ్స్ రాంబాయి' విషయంలో జరిగింది వేరు. ఈ సినిమా కేవలం ఒక ప్రాంతం ప్రేక్షకులను మాత్రమే విపరీతంగా ఆకట్టుకుంది. మిగిలిన చోట్ల అంత ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన లెక్కలు వింటే, ఒక చిన్న సినిమాకు ఇంతటి వసూళ్లు సాధ్యమేనా అనిపించక మానదు. ఆ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. బన్నీ వాసు చెప్పిన దాని ప్రకారం.. కేవలం నైజాంలోనే ఈ సినిమా దాదాపు 13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో షేర్ విలువ సుమారు 6 కోట్ల వరకు ఉంటుంది. అసలు ఏమాత్రం స్టార్ కాస్ట్ లేని ఒక చిన్న సినిమాకు నైజాంలో 13 కోట్ల గ్రాస్ రావడం అంటే అది మామూలు విషయం కాదని, అది తమకు కూడా పెద్ద సర్ప్రైజ్ అని బన్నీ వాసు పేర్కొన్నారు.
నైజాంలో ఇంతలా ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం, ఓవర్సీస్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. అమెరికాలో ఈ సినిమాకు వచ్చిన రెవెన్యూ జీరో అని బన్నీ వాసు కుండబద్దలు కొట్టారు. అక్కడ కేవలం 50 వేల నుండి 60 వేల డాలర్లు మాత్రమే వచ్చాయని, అది కేవలం సినిమా రిలీజ్ ఖర్చులకే సరిపోయిందని వంశీ నందిపాటి తెలిపారు. నైజాం ఆడియన్స్‌కు నచ్చిన ఈ నేటివిటీ, అమెరికా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని అర్థమవుతోంది.
ఇదే సమయంలో వారు 'లిటిల్ హార్ట్స్' సినిమా గురించి కూడా ప్రస్తావించారు. 'రాజు వెడ్స్ రాంబాయి'కి పూర్తి భిన్నంగా 'లిటిల్ హార్ట్స్' సినిమా ఓవర్సీస్‌లో అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమా అక్కడ 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఒక సినిమా లోకల్ మాస్ ఆడియన్స్‌కి నచ్చితే, మరో సినిమా క్లాస్ ఆడియన్స్‌కి, ఎన్నారైలకు నచ్చుతుందని ఈ రెండు సినిమాల ఫలితాలు నిరూపిస్తున్నాయి.
'రాజు వెడ్స్ రాంబాయి' ఓవర్సీస్‌లో రాణించకపోయినా, నైజాం వసూళ్లతోనే సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది. ఆంధ్రాలో కూడా పర్వాలేదనిపించినా, నైజాం రేంజ్ వసూళ్లు మాత్రం రాలేదు. ఏది ఏమైనా ఒక చిన్న సినిమాకు 13 కోట్ల గ్రాస్ ఒక్క ఏరియా నుంచే రావడం అనేది ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ విశేషం. కంటెంట్ ఎవరికి కనెక్ట్ అయితే అక్కడ కాసుల వర్షం కురుస్తుందని ఈ సినిమా రుజువు చేసింది.
