ఐబొమ్మ మూసేస్తే.. మా కలెక్షన్స్ పెరిగాయ్!
కొన్నిసార్లు బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు లేకపోయినా కోట్లు కొల్లగొట్టొచ్చు అని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి.
By: M Prashanth | 25 Nov 2025 10:46 AM ISTకొన్నిసార్లు బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు లేకపోయినా కోట్లు కొల్లగొట్టొచ్చు అని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమా సక్సెస్ చూసి ఆనందంలో ఉన్న నిర్మాతలు, తాజాగా మీడియా ముందు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ముఖ్యంగా కలెక్షన్స్ పెరగడానికి ఒక ఊహించని కారణం ఉందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రం సి సెంటర్లలో దుమ్ములేపుతోంది. రీసెంట్ గా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' తరహాలోనే ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడానికి కంటెంట్ తో పాటు బయట జరిగిన పరిస్థితులు కూడా బాగా కలిసొచ్చాయట. అదేంటో తెలిస్తే నిజమే కదా అనిపించకమానదు.
ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సక్సెస్ గురించి మాట్లాడుతూ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రముఖ పైరసీ సైట్ 'ఐబొమ్మ' షట్ డౌన్ అవ్వడం తమ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యిందని ఓపెన్ గా చెప్పారు. ఆ సైట్ మూతపడటంతో జనం థియేటర్లకు రావడం పెరిగిందని, అందుకే తమ బాక్సాఫీస్ నంబర్లు అమాంతం పెరిగాయని ఆనందం వ్యక్తం చేశారు.
దీనికి తోడు రూ.99 టికెట్ ధర పెట్టడం కూడా ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించిందని అన్నారు. సినిమా సక్సెస్ రేంజ్ గురించి చెబుతూ.. ఈ చిత్రం లాంగ్ రన్ లో రూ.50 కోట్ల మార్క్ ను టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని బన్నీ వాస్ ధీమా వ్యక్తం చేశారు. చిన్న సినిమాగా మొదలై ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. తాము పెట్టిన పెట్టుబడికి ఏకంగా నాలుగు రెట్లు లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఇలాంటి రిటర్న్స్ చాలా అరుదుగా చూస్తుంటాం. ఇక ఈ సినిమా విజయంలో మరో కీలక అంశం లేడీస్ సెంటిమెంట్. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నారని బన్నివాసు అన్నారు. క్లైమాక్స్ లో ఉండే ఎమోషన్, లవ్ ట్రాక్ లోని డెప్త్ మహిళా ప్రేక్షకులను కూడా థియేటర్లకు రప్పిస్తోందని.. సి సెంటర్లలో మాస్ ఆడియన్స్ తో పాటు లేడీస్ ఆదరణ కూడా తోడవ్వడం సినిమాకు బూస్ట్ ఇచ్చిందని తెలిపారు.
ఒక పక్క కంటెంట్, మరో పక్క సరైన స్ట్రాటజీ (టికెట్ ధరలు), ఇంకో పక్క ఐబొమ్మ లేకపోవడం.. ఈ మూడు అంశాలు కలిసి 'రాజు వెడ్స్ రాంబాయి'ని బ్లాక్ బస్టర్ దిశగా నడిపిస్తున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. బన్నీ వాస్ చెప్పినట్లు రానున్న రోజుల్లో చిన్న సినిమాలకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పైరసీ భూతం పోయి, జనం ఇలాగే థియేటర్లకు వస్తే ఇండస్ట్రీకి అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
