రాజ్‌పాల్ మనసుకు తగిలిన గాయం ప్రభావం!
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పుట్టుకతోనే కమెడియన్.. కష్ట కాలంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన గొప్పతనం అని కొందరు ప్రశంసిస్తున్నారు.
By: Sivaji Kontham | 21 Feb 2026 1:00 AM ISTహాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ అంటేనే ఒక విలక్షణమైన శైలి. విచారంలో ఉన్నా కూడా నవ్వులు పూయించడం ఆయన స్పెషాలిటీ. అయితే తాజాగా ఆయన జైలు జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
ఓ ఫ్లాప్ సినిమాని నిర్మించగా దానికోసం, సుమారు 5 కోట్ల రుణం తీసుకున్నారు రాజ్‌పాల్. దానికి వడ్డీతో కలిపి 9 కోట్లు సకాలంలో చెల్లించలేదనే కారణంతో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు అండగా నిలిచినా కానీ చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఆయన జైలుకు వెళ్లారు.
అతడికి షరతులతో కూడుకున్న బెయిల్ రావడానికి కొంత సమయం పట్టింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన అక్కడి పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సెటైరికల్ గా ఉన్నాయి. అతడు జైలు గదుల దుస్థితిని, ప్రాథమిక వసతుల కొరతను ఎత్తిచూపారు.
జైలు గదులను రైల్వే కోచ్‌లు, ఎయిర్‌పోర్టులతో పోల్చి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జైలు లోపల స్మోకింగ్ ఏరియాలు ఉండాలని, ఖైదీల కోసం `కౌన్ బనేగా కరోడ్‌పతి`(కేబీసీ) వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ లైఫ్ లైన్లుగా ఉండాలని జోకులు పేల్చారు.
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పుట్టుకతోనే కమెడియన్.. కష్ట కాలంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన గొప్పతనం అని కొందరు ప్రశంసిస్తున్నారు. ఆయన మాటల్లోని వ్యంగ్యం వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతోందని వీరి భావన. అప్పు ఎగ్గొట్టి జైలుకు వెళ్లి దాన్ని కూడా ఒక పిక్నిక్ లాగా వర్ణించడం బాధ్యతారాహిత్యం! అని మరికొందరు మండిపడుతున్నారు. జైలు శిక్షను ఇంత తేలికగా తీసుకోకూడదని వీరి వాదన.
రాజ్ పాల్ యాదవ్ లాంటి నటులు ఎంతటి విషాదంలో ఉన్నా హాస్యాన్ని వదలరు. అయితే, కోట్లాది రూపాయల అప్పుల విషయంలో ఆయన చిక్కుకున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు బాధితులకు (డబ్బు రావాల్సిన వారికి) కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఏది ఏమైనా తన `మనసుకు గాయం అయినా కూడా ప్రేక్షకులను నవ్వించాలనే ఆయన ప్రయత్నం మళ్ళీ వార్తల్లో నిలిచేలా చేసింది. రాజ్ పాల్ యాదవ్ ఇటీవల తన మేనకోడలి పెళ్లికి వెళ్లారు. పెళ్లిలో అతడు ఎంతో జోవియల్ గా డ్యాన్సులు చేస్తూ కనిపించారు.
