Begin typing your search above and press return to search.

బయోపిక్స్‌కే బ్రాండ్ అంబాసడరా? కమర్షియల్ సినిమాలు ఎప్పుడు?

బాలీవుడ్‌లో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ రావు ఇప్పుడు కెరీర్‌లో మరో కీలక దశలోకి అడుగుపెడుతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 July 2026 4:00 PM IST
బయోపిక్స్‌కే బ్రాండ్ అంబాసడరా? కమర్షియల్ సినిమాలు ఎప్పుడు?
X

బాలీవుడ్‌లో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ రావు ఇప్పుడు కెరీర్‌లో మరో కీలక దశలోకి అడుగుపెడుతున్నారు. వచ్చే రెండేళ్లలో ఆయన నటించనున్న మూడు సినిమాలు కూడా నిజజీవిత కథల ఆధారంగా తెరకెక్కుతుండటం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఒకే జానర్‌లో వరుస ప్రాజెక్టులు చేయడం సాధారణ విషయం కాదు. అయినప్పటికీ, తనపై నటుడిగా ఉన్న‌ నమ్మకంతో రాజ్‌కుమార్ ఈ సవాల్‌ను స్వీకరించినట్లు కనిపిస్తోంది.

మొదటగా ప్రహార్ ద్వారా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ పాత్రలో కనిపించనున్న ఆయన, ఆ తర్వాత రఫ్తార్లో భారత స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన BYJU'S కథ ఆధారంగా రూపొందుతున్న సినిమాలో నటించనున్నారు. త‌ర్వాత భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న దాదాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మూడు సినిమాల నేపథ్యాలు పూర్తిగా భిన్నంగా ఉన్నప్పటికీ, వాటి మూలం మాత్రం నిజజీవిత సంఘటనలే కావడం విశేషం.

ఇదే కారణంగా ఇప్పుడు చాలామంది రాజ్‌కుమార్ రావును బాలీవుడ్ బయోపిక్స్‌కు బ్రాండ్ అంబాసడర్ గా అభివర్ణిస్తున్నారు. గతంలో కూడా నిజజీవిత వ్యక్తిత్వాలను తెరపై సహజంగా ఆవిష్కరించిన ఆయన, మరోసారి అలాంటి పాత్రలకే వరుసగా ఎంపిక కావడం దర్శక‌నిర్మాతలు ఆయన న‌ట‌న‌పై ఉంచిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది. పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడం ఆయన బలంగా మారడంతో ఇలాంటి కథలు సహజంగానే ఆయన వద్దకు వస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

అయితే ప్రేక్షకుల్లో మరో ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ కూడా సాగుతోంది. రాజ్‌కుమార్ రావు యాక్టింగ్ పై ఎలాంటి సందేహాలు లేకపోయినా, వరుస బయోపిక్స్ తర్వాత ఆయన నుంచి పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అంశంపై తరచూ పోస్టులు కనిపిస్తున్నాయి. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే పరిమితం కాకుండా, మాస్ ఆడియ‌న్స్ ను ఆకట్టుకునే కథల్లో కూడా ఆయనను చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో బయోపిక్స్‌తో పాటు కమర్షియల్ సినిమాల మధ్య సమతుల్యతను ఎలా కొనసాగిస్తారనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఈ మూడు సినిమాలు మూడు వేర్వేరు వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నాయి. ప్రహార్ లో కోర్ట్‌రూమ్ డ్రామా, దేశభక్తి ఎమోష‌న్స్ మెయిన్ ఎట్రాక్ష‌న్ గా ఉండ‌గా, రఫ్తార్ కార్పొరేట్ వ‌ర‌ల్డ్, స్టార్టప్ కల్చర్‌పై ఆసక్తి ఉన్న ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక దాదా మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను థియేటర్లకు తీసుకురాగల సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. అంటే మూడు సినిమాలు ఒకే జానర్‌కు చెందినవైనా, వాటి టార్గెటెడ్ ఆడియన్స్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఇటీవలి కాలంలో బయోపిక్స్‌కు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలే వచ్చిన నేపథ్యంలో, రాజ్‌కుమార్ రావు ఈ మూడు సినిమాల‌తో ఆ ట్రెండ్‌ను మార్చగలడా అనే ప్రశ్న కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది.