Begin typing your search above and press return to search.

గంగూలీ ఫ్యాన్స్ పవర్ అంటే అది!

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ `దాదా`లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   9 Oct 2026 2:00 PM IST
గంగూలీ ఫ్యాన్స్ పవర్ అంటే అది!
X

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ `దాదా`లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోస్టర్ నాసిరకంగా ఉందంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హడావుడిగా రూపొందించి నట్లుగా ఉంద‌ని క్రీడాభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో పెదవి విరిచారు. ఈ విమర్శలపై తాజాగా రాజ్‌కుమార్ రావు స్పందించారు. పోస్టర్ రూపకర్తలు త‌మ తప్పు నుంచి పాఠం నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. `ఆ పోస్టర్‌ను తయారు చేసినవారు తప్పు తెలుసుకున్నారు. తగిన పాఠం నేర్చుకున్నారు. ఇలాంటి విషయాల్లో హడావుడి చేయకూడదని తగిన సమయం తీసుకుని నాణ్యతతో రూపొందించాలని వారికి అర్ద‌మైంది` అని రాజ్‌కుమార్ తెలిపారు.

ఈ విమర్శల ద్వారా చిత్రబృందానికి మరొ ముఖ్యమైన విషయం కూడా బోధపడిందని రాజ్‌కుమార్ రావు పేర్కొన్నారు. భారతదేశంలో సౌరవ్ గంగూలీకి ఎంతటి పిచ్చి అభిమాన గణం ఉందో? ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైందన్నారు. దాదా అభిమానులు ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో ఆపేక్షతో, నిశితంగా గమనిస్తారని కాబట్టి వారి అంచనాలకు తగ్గట్లుగా ప్రమోషనల్ కంటెంట్‌ను తీసుకురావాల్సి ఉంటుందని చిత్ర బృందం గ్రహించిందని వ్యాఖ్యానించారు.

ఈ బయోపిక్ కోసం సౌరవ్ గంగూలీని స్వయంగా కలవడంపై రాజ్‌కుమార్ రావు స్పందించారు. కొల్‌కతాలో దాదాతో సుదీర్ఘ సమయం గడిపినట్లు వెల్లడించారు. `మేము ఇద్దరం ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. ఒక వ్యక్తి మనస్తత్వాన్ని, ఆలోచనా విధానాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఆయన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం` అని అన్నారు. గంగూలీ తన జీవితాన్ని ఎంతో విస్పష్టంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా తన ముందు ఉంచారని కొనియాడారు.

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రంగంలో దిగ్గజమని, నేటి ఆధునిక భారత క్రికెట్ జట్టు విజయాలకు ఆయనే బలమైన పునాది వేశారని రాజ్‌కుమార్ రావు ప్రశంసించారు. `దాదా`గా అభిమానులు పిలుచుకునే గంగూలీ పాత్రను వెండితెరపై పోషించడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో గంగూలీ క్రికెట్ ప్రస్థానంతో పాటు ఆయన నాయకత్వ పటిమ, జీవితంలో ఆసక్తికర ఘట్టాలను కూడా ఆవిష్కరించనున్నారు.

ప్ర‌స్తుతం రాజ్‌కుమార్ రావు నటించిన `ప్రహార్: ది ఉజ్వల్ నికమ్ స్టోరీ` అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో పాటు ఆయన చేతిలో `దాదా`, `స్త్రీ 3`, `రఫ్తార్` వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. `స్త్రీ 3`ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రేక్షకులను విశేషంగా అలరించేలా సీక్వెల్ స్క్రిప్ట్‌పై చిత్రబృందం పని చేస్తోందని రాజ్‌కుమార్ తెలిపారు.